Gadwal district: జిల్లా కేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో కొన్ని వార్డులలో చెత్త సేకరణ నిలిచిపోయింది. కొన్ని వార్డులలో చెత్త సేకరణ వాహనాలు రాక ఇండ్లలోనే చెత్త సేకరణ అక్కడే పేరుకుపోతున్నది. ఎంతో ఘనమైన చరిత్ర గల గద్వాల(Gadwala) పట్టణం పురపాలక సంఘం రోజురోజుకూ విస్తరిస్తోంది. పట్టణంలో ప్రతి రోజు చెత్త సేకరించి తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులు చర్యలు చేపడుతున్నారు. కాగా వ్యర్థాలను సేకరించే వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్నిరోజుల వ్యవధిలోనే మూలకు చేరుతుండటంతో పారిశుద్ధ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. మున్సిపాలిటీ మొత్తం 37 వార్డులుగా విస్తరించి ఉంది. ప్రస్తుతం మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో అధికారుల్లో అలసత్వం నెలకొంది. ఫలితంగా వార్డులలో సమస్యలు తిష్ట వేస్తున్నాయి. పట్టణ ప్రధాన రహదారులపై సైతం క్లీనింగ్ ప్రక్రియ తరచుగా చేపట్టకపోవడంతో దుమ్ము ధూళితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రోజు విడిచి రోజు చెత్త సేకరణ
వీధులలో ప్రతీరోజు చెత్త సేకరణ చేయాల్సి ఉన్నప్పటికీ వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో పూర్తి స్థాయిలో సేకరణ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణకు 19 ఆటోలు ఉండగా 17 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. వీటితో పాటు మరో 7 ట్రాక్టర్లున్నాయి. పట్టణంలో రెండు చిన్న వార్డులకు ఒకటి చొప్పున, పెద్ద వార్డుల్లో ఒకటి చొప్పున చెత్త ట్రాక్టర్లను తిప్పుతున్నారు. వాహనాల కొరత కారణంగా కొన్ని వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్త సేకరణకు వస్తున్నట్లు పలు వార్డుల ప్రజలు చెబుతున్నారు. కాగ గత రెండు నెలలుగా ఇంటింటికి చెత్త సేకరణకు వస్తున్న వాహనాలు మూడు, నాలుగు రోజులకోసారి వస్తుండటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త ఇండ్లలోనే చెత్త పేరుకపోవడంతో దుర్వాసన వస్తుందని, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కాలనీవాసులు పేర్కొన్నారు.
పలు వార్డులలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం
గద్వాల(Gadwala) మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను తొలగిస్తున్నప్పటికీ ప్రధాన రహదారుల వెంబడి దుకాణ దారులు, లాడ్జీలు ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపిస్తుందని స్థానికులు అంటున్నారు. కొందరు ఇష్టారాజ్యంగా వ్యర్థాలను రోడ్డుపై, మురుగు కాలువల్లో పడేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఉదయం వేళల్లో చెత్త సేకరిస్తున్నప్పటికీ పారిశుద్ధ్య పేరుకపోతున్నదని పట్టణ ప్రజలు అంటున్నారు. చెత్తను రోడ్లపై వేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిధులు లేక మరమ్మతులకు నోచుకోక
గద్వాల మున్సిపాలిటీలో చెత్త సేకరణ కోసం ఒక్కోటి లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసినా చెత్త సేకరణ ఆటోలు మూలనపడ్డాయి. కొన్ని ఆటో(Auto)లు చెడిపోవడం, మరి కొన్ని వాహనాల టైర్లు పాడవడంతో నిధులు లేక మరమ్మతులు చేయించడం లేదన్న అరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఆటోలు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల పాత సామగ్రికి వేయాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
క్రమం తప్పకుండా సేకరణ
చెత్త సేకరించే ఆటోలు కొన్ని మరమ్మతుకు గురైనప్పటికీ సేకరణ జరుగుతోంది. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించకుండా అన్ని చర్చ తీసుకుంటున్నాం. చెత్త సమస్య ఉన్న ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో వాహనాల ద్వారా సిబ్బంది సేకరిస్తున్నారు. వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయకుండా చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లో వేయాలి. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, గద్వాల మున్సిపల్ కమీషనర్ దశరథ్ తెలిపారు.
Also Read: Aaraa Mastan: మెట్టుగూడ స్థలంలో నిర్మాణాల కూల్చివేత.. మీడియాపై ఆంక్షలు
