- జేసీబీతో పని పూర్తిచేసిన మస్తాన్ మనుషులు
- మీడియాను కూడా లోపలికి వెళ్లనివ్వని వైనం
- 60 ఏండ్లుగా పొజిషన్‌లో ఉన్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ
- ఉదయం 6 గంటలకే మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించిన వైనం
- మొన్న స్టేషన్‌లో నిర్భందం, నిన్న తెల్లవారుజామున ఇంట్లో తనిఖీలు
- ఆ డీపీసీపై ఉన్నది ఉన్నట్లు చెప్పినందుకు వేధింపులు
- సీసీ కెమెరాలో రికార్డు అయినా పోలీసుల వ్యవహారం
- మస్తాన్ మాయ మాటలతో బుక్ అవుతున్న అధికారులు
Aaraa Mastan: మెట్టుగూడ భూకబ్జా వ్యవహారంలో బాధితులు భయపడ్డంతా జరిగింది. తనకున్న రాజకీయ పలుకుబడి, పోలీస్ పరిచయాలతో ఆరా మస్తాన్ చేయాలనుకున్నది చేసేశాడు. 60 ఏళ్లుగా రమేశ్ పొజీషన్‌లో ఉన్న స్థలాన్ని ఆక్రమించాడు. ఈ క్రమంలో తన మనుషులను పంపించి జేసీబీ పెట్టి స్థలంలో ఉన్న ఇంటిని కూల్చివేశాడు. ఇదంతా జరుగుతున్నపుడు అక్కడికి మీడియా ప్రతినిధులు సైతం రాకుండా కాపలా పెట్టాడు. స్థానికులను కూడా రానివ్వలేదు. ఇంత జరిగినా అటు వైపు పోలీసులు తొంగిచూడక పోవటం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం సికింద్రాబాద్ మెట్టుగూడలోని సర్వే నెంబర్ 733లో 5,717 గజాల స్థలం ఉంది. గతంలో చార్మినార్ పాట్రీ సిరామిక్ కంపెనీ యజమాని నర్సి పాంచ్ దీని యజమాని. కాగా, దాదాపు 60 ఏళ్ల క్రితం కుమారస్వామి ఈ స్థలాన్ని నర్సి పాంచ్ నుంచి కొన్నాడు. కుమారస్వామి చనిపోయిన తర్వాత ఆయన కుమారులు రమేశ్ సోదరుల పేర భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇదిలా ఉండగా చార్మినార్ పాట్రీ సిరామిక్ కంపెనీ యజమాని నర్సి పాంచ్, జితేందర్మెహతా అనే వ్యక్తి మధ్య అప్పట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు నడిచాయి. అయితే, వీటిని జితేందర్ మెహతా కుటుంబం నర్సి పాంచతో సెటిల్ చేసుకున్నారు. అప్పటి నుంచి కుమారస్వామి కుమారుడైన రమేశ్స్థలం పొజిషన్‌లో ఉన్నాడు. కాగా, 2024లో ఈ స్థలంపై ఆరా మస్తాన్ కన్ను పడింది. ఈ క్రమంలో జితేందర్ మెహతా వారసుల నుంచి కొన్నట్టుగా ఆరా మస్తాన్ 2024, నవంబర్‌లో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నెంబర్లు 3383/2024, 3384/2024) చేయించుకున్నాడు.
కుట్రకు తెర ఇలా..
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సబ్ రిజిస్ట్రార్ దానిని రిజిస్టర్ చేయడమే. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తరువాత ఆరా మస్తాన్ అప్పటికే 60 ఏళ్లుగా స్థలంలో పొజిషన్‌లో ఉన్న రమేశ్ తదితరులను అక్కడి నుంచి పంపించే కుట్రలకు తెర లేపాడు. చైతన్య విస్టా స్కూల్స్ అధినేత మల్లంపాటి శ్రీధర్‌తో కలిసి స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తమ స్థలంలో నివాసముంటున్న వాచ్‌మెన్ కుటుంబంపై ఆరా మస్తాన్ మనుషులు ఆదివారం దాడి చేసినట్టు బాధితుడు రమేశ్ తెలిపాడు. అక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తామంటూ వాచ్‌మెన్ కుటుంబాన్ని పంపించేశారని చెప్పాడు. స్థలంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా మస్తాన్ మనుషులు ధ్వంసం చేసినట్టు తెలియచేశాడు. దీనిపై చిలకలగూడ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేసినట్టు చెప్పాడు. అయితే, తన స్థలంలోకి అక్రమంగా చొరబడి వాచ్‌మెన్‌పై దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన మస్తాన్, అతని మనుషులపై చర్యలు తీసుకోకుండా పోలీసులు తమనే బెదిరిస్తున్నట్టుగా రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సోమవారం తెల్లవారుజామున ముగ్గురు పోలీసులు సివిల్ దుస్తుల్లో తమ ఇంటికి వచ్చి సోదాల పేరిట హంగామా సృష్టించారని తెలిపాడు. తన కొడుకు గురించి ఆరా తీశారని, అతనెందుకు అని ప్రశ్నిస్తే సరైన జవాబు ఇవ్వకుండా తమకు అప్పగించాలంటూ బెదిరించారని చెప్పాడు. గతంలో స్థల వివాదంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వద్దకు మస్తాన్ తమను పిలిపించినట్టుగా తెలియచేశాడు. డీసీపీ సమక్షంలోనే సెటిల్ చేసుకోవాలంటూ బెదిరించాడని చెప్పాడు. పోలీసు అధికారులను మేనేజ్ చేస్తూ తన స్థలాన్ని కబ్జా చేయటానికి ఆరా మస్తాన్, మల్లంపాటి శ్రీధర్ ప్రయత్నిస్తున్నారని తెలిపాడు.
Read Also- NIMS Fire: నిమ్స్ అగ్నిప్రమాదం కేసులో విచిత్రం
కొన్ని గంటల్లోనే..
మస్తాన్ అతని మనుషుల నుంచి తమకు ప్రాణహాని ఉందని రమేశ్ ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే ఆయన భయపడ్డంతా జరిగింది. సోమవారం మధ్యాహ్నం వివాదాస్పద స్థలం దగ్గరికి వచ్చిన ఆరా మస్తాన్ మనుషులు దాదాపు 30 మంది తమ వెంట జేసీబీని కూడా తీసుకొచ్చారు. నేరుగా స్థలం లోపలికి వెళ్లి జేసీబీతో ఇంటిని కూల్చేశారు. విషయం తెలిసి అక్కడికి మీడియా ప్రతినిధులు వెళ్లగా బయట నిలబడ్డ మస్తాన్ మనుషులు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. పైగా, లోపలికి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. స్థానికులు రావటానికి ప్రయత్నించగా మీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టిస్తామని భయపెట్టారు. ఆ తర్వాత చకచకా కూల్చివేత పనులను ముగించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అక్కడికి రాకపోవటం గమనార్హం.
Read Also- Nysa Devgn: కూతురు స్కూల్ గ్రాడ్యుయేషన్.. గర్వంగా ఉందంటున్న కాజోల్, అజయ్ దేవగన్