Gadwal District: యూరియా కోసం రైతులు రైతు ఆగ్రో కేంద్రాలు, ప్రాథమిక సహకార కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. పిఎసిఎస్ అధికారులు రైతులకు కేవలం ఒక బస్తా యూరియా ఇస్తుండగా దానిని పొందేందుకు వర్షంలో సైతం తడుస్తూ క్యూ లైన్ లలో నిలబడి పొందాల్సిన పరిస్థితి దాపురించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ పాస్ మిషన్ ద్వారా రైతుకు ఓటిపి వచ్చిన తరువాత రసీదు ఇస్తుండడంతో గంటలకొద్దీ క్యూ లైన్ ల లో రైతులు నిలబడాల్సి వస్తోంది.
అరకొర నిల్వలతో రైతుల ఇక్కట్లు
జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాకాలం సాగులో భాగంగా 3.67 లక్షల ఎకరాలలో సాగు విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముగా ఇప్పటికే ఆ మేరకు వివిధ పంటలకు యూరియాను ఉపయోగిస్తున్నారు. కేవలం 200 ల మెట్రిక్ టన్నుల నిల్వలు మార్క్ ఫెడ్ వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు కేవలం రైతుకు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్నారు.
Also Read: Actress: పెళ్ళై పిల్లలున్న డైరెక్టర్ పై మోజు పడుతున్న కుర్ర హీరోయిన్?
గోదాములలో యూరియాను పరిశీలించిన కలెక్టర్
యూరియా నిల్వను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన ఎరువులను అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(BM Santhosh) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐజా రోడ్డు కొండపల్లి సమీపంలో ఉన్న సి.ఐ.ఎల్. ప్రైవేట్ లిమిటెడ్ యూరియా గోడౌన్ ను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గోదాములో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. రైతులకు ఎరువులు సమయానికి అందేలా గోదాంల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని స్పష్టం చేశారు. గోదాంలలో నిల్వ ఉంచిన ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైతులు తమ అవసరం మేరకు
యూరియా కోసం రైతులకు ఇబ్బంది పడకుండా చూడాలని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియాను సకాలంలో అందించాలన్నారు. యూరియా స్టాక్‌ను ప్రభుత్వ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతో పాటు ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు తమ అవసరం మేరకు మాత్రమే యూరియాను కొనుగోలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా కృత్రిమ కొరత తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, ఏడీఏ సంగీత లక్ష్మి, మండల వ్యవసాయాధికారి ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Election Commission: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీ కీలక ప్రకటన