Election Commission: ఓటర్ల జాబితాలో సవరణలు, ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) శనివారం కీలక ప్రకటన చేసింది. బీహార్‌లో చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై వివరణ ఇచ్చింది. ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన అన్ని దశల్లోనూ రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేశామని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా, ఇప్పుడు విమర్శలకు దిగడం సరికాదని ఈసీ వ్యాఖ్యానించింది. ఆదివారం కీలక మీడియా సమావేశం నిర్వహించడానికి ముందు ఈసీ ఈ ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది.
ఓటర్ల ప్రాథమిక జాబితాకు సంబంధించిన కాపీలను భౌతికంగా, డిజిటల్ కాపీలను అన్ని రాజకీయ పార్టీలకు పంపిస్తామని ఈసీ స్పష్టం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే నివేదించేందుకు ఒక నెల గడువు కూడా ఇస్తామని వెల్లడించింది. రెండు స్థాయిలలో అపీల్స్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఓటర్ల తుది జాబితాను గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు పంపిస్తామని ఈసీ క్లారిటీ ఇచ్చింది.
Read Also- Minister Seethaka: మహిళా సంఘాలకు రూ.800 కోట్లు వడ్డీ లేని రుణాలు!
కొన్ని పార్టీలు, ఆ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు సకాలంలో ఎన్నికల జాబితాను పరిశీలించలేదని, ఆ సమయంలో తప్పులను ఎత్తి చూపించకుండా ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని సమర్థించుకుంది. అభ్యంతరాలు లేవనెత్తుతున్న పార్టీ సకాలంలో, సరైన మార్గంలో అభ్యంతరాలు లేవనెత్తలేదని మండిపడింది. 2025 జూలై 20 నుంచి బీహార్‌లో ఓట్ల తొలగింపు సంబంధిత వివరాల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందించామని, కానీ ఏ పార్టీ మాట్లాడలేదని పేర్కొంది. మరణం, శాశ్వత వలస, సమాచారం లేని వ్యక్తులు, డూప్లికేట్ ఎంట్రీల కారణంగా కొందరు ఓటర్లను తొలగించినట్టు పేర్కొన్నామని తెలిపింది. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎలా ఫిర్యాదు చేయాలో కూడా మార్గదర్శకాలు జారీ చేశామని పేర్కొంది.
రాహుల్‌కు కౌంటర్
ఓట్ల దొంగతనం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానంటూ రాహుల్ గాంధీ లిఖితపూర్వకంగా చెప్పాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. అక్రమంగా ఎవరి పేర్లు ఓటర్ల జాబితాలో చేరాయో, ఎవరి పేర్లు తొలగింపునకు గురయ్యాయో రాహుల్ వివరాలు అందించాలని, సంతకంతో పాటు లిఖితపూర్వకంగా సమర్పించాలంటూ రాహుల్ గాంధీని ఈసీ కోరింది.
Read Also- Irfan Pathan: మేమంతా చనిపోయినట్టే అనిపించింది.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
అసలేంటీ వివాదం?
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. అయితే, ఎన్నికలకు ముందు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను ఈసీ చేపట్టింది. ఈ ప్రక్రియలో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగింపునకు గురయ్యాయి. దీంతో, ఎలక్షన్ కమిషన్‌పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ‘ఓట్ల చోరీ’ చేశారని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఆయన పంచుకున్నారు. ఈసీ కోరిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చాలా మంది ఓటు హక్కు కోల్పోయారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా కలగజేసుకుంది. అర్హులందరినీ వేరిఫై చేసి ఓటు హక్కు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తొలగింపునకు గురైన ఓటర్ల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురించాలని, పాఠకుల సంఖ్య ఎక్కువగా ఉన్న మీడియాలో ప్రకటన కూడా ఇవ్వాలని, తద్వారా సమాచారం అందరికీ అంది తిరిగి వారంతా ఓటు పొందేలా చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా, ఓట్ల తొలగింపు వివాదంపై ఎన్నికల సంఘం రేపు (ఆదివారం) ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించబోతోంది.