Hanumakonda District: ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు ప్రతినిధులు తెలియజేయాలన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(Collector Sneha Shabarish) సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని 12మండలాల్లో గ్రామపంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ఇప్పటికే ప్రచురించడం జరిగిందని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం
సోమవారం 12మండలాల్లో ఎంపీడీవోలు మండల స్థాయి లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ తమ మండలాల్లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వాటి సమాచారాన్ని సంబంధిత మండల అధికారికి అందజేయాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 9వ తేదీన సవరించిన అనంతరం పదో తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Also Read: Shivadhar Reddy: డీజీపీగా శివధర్ రెడ్డి?.. సజ్జనార్‌కు కీలక శాఖ అప్పగింత
హనుమకొండ జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు
హనుమకొండ(Hanumakonda) జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయని, 12 మండల ప్రజా పరిషత్, 12 జిల్లా ప్రజా పరిషత్ లు ఉన్నాయి అని పేర్కొన్నారు. జిల్లాలో 370871 మంది ఓటర్లు ఉండగా , ఇందులో మహిళా ఓటర్లు 190201 ఉండగా, పురుష ఓటర్లు 180666, ఇతరులు నలుగురు ఓటర్లు ఉన్నారని తెలియజేశారు. హనుమకొండ జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో రవి సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి శ్రీనివాసరావు, శ్యాంసుందర్, ప్రభాకర్ రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండి. నేహాల్, డాక్టర్ ఇండ్ల నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, జయంత్ లాల్, తదితరులతోపాటు అధికారులు పాల్గొన్నారు.