Jangaon district: పండుగొస్తే ఊరంతా సందడి సందడి గా ఉంటుంది. ఊరంతా దగదగా వెలుగులతో వీధులన్నీ పగటిని తలపించేలా ఉంటాయి. ఇంకా దసరా పండుగొస్తే ఆ ఆడంబరం, ఊరు వాతావారణం, వీధులన్నీ శుభ్రత వేరుగా ఉంటాయి. బతుకమ్మ పండుగను ఆడపడుచులు సంబురంగా జరుపుకోవాలని పంచాయతీ సిబ్బంది లైట్లన్ని వేసి ఊరునంతా వీధిదీపాలతో నింపుతారు. పంచాయతీ కార్యదర్శులు దసరా పండుగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తారు. ఇది ఒకప్పటి మాట. మరి ఇప్పటి మాటేంటి అంటే.. పంచాయతీల్లో నిధులు లేవు, ఖజానా అంతా ఖాళీ.. నిధులు లేక, సర్కారు నుంచి రాకా పంచాయతీ కార్యదర్శులు అప్పుల పాలై తిప్పలు పడుతున్నారు. ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శిని కదిలించినా ఇదే దుస్థితి. పంచాయతీ అధికారులను అడిగితే ఇదే పరిస్థితి. నిదులు సర్కారు ఇవ్వడం లేదని, మేము ఏమీ చేయాలని వాపోతున్నారు.
గ్రామాల్లో వెలుగని వీధిలైట్లు
జనగామ జిల్లా(Jangaon district)లో 12 మండలాలు ఉన్నాయి. 281 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన వీధిలైట్లు ఆరిపోయి చాలా రోజులు అవుతున్నా వాటి స్థానం లో కొత్త దీపాలు వేసిన పాపాన పోలేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శులను వీధి దీపాలు వెలుగడం లేదని అడిగితే, వీధి దీపాలు మా పరిధిలో లేవని సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఏజేన్సీలకు వీధి దీపాలు అప్పగించారని చెపుతున్నారు. మేము ఏమి చేసేది లేదని అనడంతో జనాలు ఏమి చేయాలో తెలియక బిక్కమొఖం వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో 49882 ఎల్ ఈ డీ లైట్లు భిగించారు.
వీటి నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే, ఆ ఏజేన్సీ ఇప్పుడు అడ్రక్ లేకుండా పోయాయి. ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన ప్రతినిధులు ఎప్పుడు వస్తారో.. వీధి దీపాలు ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇప్పుడు దసరా పండుగ రాబోతున్న తరుణంలో ప్రైవేటు ఏజేన్సీలు వీధీ దీపాలు వేయరు, పంచాయతీ నుండి వేసే పరిస్థితి లేదు. వీధి దీపాల పరిస్థితి ఎలా ఉందంటే అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న చందంగా ఉంది. ఒకవేళ పంచాయతీ కార్యదర్శి సహాసం చేసి వేద్దామంటే పంచాయతీల్లో నిధులు సున్నా. ఇలా ఇప్పుడు పంచాయతీల్లో వీధి దీపాలు వెలుగక ప్రజల బతుకులు చీకటిమయం అయ్యాయి. వీధి దీపాలు వేయాలంటే కార్యదర్శులు గ్రామస్తులను చందాలు అడిగి వేసే పరిస్థితి వచ్చింది.
వీది దీపాలు వేసేందుకు ఎవ్వరైనా దాత ముందుకు రాబోతారా అని కార్యదర్శులు ఎదురు చూస్తున్నారు. మండల కేంద్రాల్లో కూడా వీది దీపాలు వెలుగులు లేక నెలలు గడుస్తుంది. వీదులన్నీ చీకటి మయం అవుతున్నా పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. మున్సిపాలిటీల్లో నిత్యం ఇంటిపన్నులు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నందున ఆర్ధికంగా కొంత వెసులుబాటు ఉంది. దీంతో జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీల్లో వీధి దీపాలు ఎప్పుడు ఆరిపోయినా వాటికి మరమ్మతులు చేయడం, లేదా కొత్తవి వేయడం చేస్తున్నారు.
Also Read: Actress Navya Nair: నటికి బిగ్ షాక్.. మల్లెపూలు పెట్టుకుందని.. ఏకంగా రూ.1.14 లక్షల ఫైన్
దోమల రోద.. ప్రజల రోధన
ఇక గ్రామ పంచాయతీల్లో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే పారిశుద్యం పడకేసింది. దీంతో ఎక్కడ చూసిన పారిశుధ్య లోపం కనిపిస్తుంది. పంచాయతీ కార్యదర్శులు ఎంతో కొంతగా గ్రామాల్లో చెత్త చెదారం పంచాయతీ ట్రాక్టర్లతో సేకరిస్తున్నప్పటికి అది ఏమూలకు సరిపోవడం లేదు. సిబ్బంది వారానికోసారి, పక్షం రోజులకు ఒకసారి చెత్తను సేకరిస్తున్నారు. సొంత ట్రాక్టర్లు ఉన్నా వాటికి డిజిల్ పోసే పరిస్థితి లేదు. దీంతో ట్రాక్టర్లు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితి. ఇక గ్రామాల్లో పారిశుద్యం లోపిస్తుండటంతో ఈగలు, దోమల రోదతో ప్రజలకు అంటువ్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పారిశుద్యం సమస్యలు, మురుగునీరు నిల్వలు ఉండటంతో దోమల వ్యాప్తి చెందాయి.
దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో జనాలు విష జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లాలో133 గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసినప్పటికి వాటిని ఉపయోగించి, ఫాగింగ్ చేయాలంటే వాటి వినియోగానికి నిధులు లేవు. దీంతో అవి కేవలం అలంకారప్రాయంగానే పంచాయతీ కార్యాలయాల్లో మూలకు మూలుగుతున్నాయి. ఇక గ్రామాల్లో ఉండే ట్రాక్టర్లు, ట్యాంకర్లను రాజకీయ నేతలు తమ స్వంతాలకు వాడుకుంటున్నారు. కొందరు పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్లను కిరాయిలకు పంపుతూ కొద్దొగొప్పో వనరులను సమకూర్చుకుంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు.
అప్పుల పాలవుతున్నాంటున్న కార్యదర్శులు
గ్రామల్లో ఇప్పుడు నెలకొన్న అత్యంత సమస్యలు వీధి దీపాలు, నీటి సమస్య, పారిశుద్యం. ఈ మూడింటిని ఎలాగొలా నిర్వహిద్దామనుకుంటే నిధులు లేక, ఖజానా ఖాళీగా ఉండటంతో ఏమి చేయాలో దిక్కు తోచక పంచాయతీ కార్యదర్శులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారు. ఎక్కడ ఊరు తిరిగితే జనాలు నిలదీస్తారో అనే భయం కార్యదర్శుల్లో పట్టుకుంది. నీటిని అందించే బోర్లు కాలిపోతే వారాలు, నెలలు గడుస్తున్నా వాటికి మరమ్మత్తు చేసే స్తోమత్త లేదు.
కార్యదర్శులు అప్పులు తెచ్చి మోటార్లను బాగు చేయిస్తున్నారు. కొందరు కార్యదర్శులు అప్పు పుట్టకపోవడంతో తమ జేబుల నుంచి, గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగి పనులు చేస్తున్నారు. ఇప్పటికి ప్రతి కార్యదర్శి వేల నుంచి లక్షల వరకు అప్పులు ఉన్నారంటే ఎంతటి ధీనమైన పరిస్థితి ఉందో అవగతం అవుతుంది. వేతనాలు రాకపోతే ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో, అసలు అభివృద్దికి, మౌళిక వసతుల కల్పనకు కూడా నిధులు ఇవ్వకుంటే ఏమి చేయాలో పాలుపోక కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. ఇకనైనా రాబోతున్న దసరాను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో వీధిదీపాలు వేసేలా, పారిశుద్య పనులు చేసేలా, నీటి నిర్వహణకు నిధులు ఇవ్వాలని ప్రజలు, పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
Also Read: Shrasti Verma: శ్రష్ఠి వర్మ టార్గెట్ అతడేనా.. బిగ్ బాస్ హౌస్‌లో ఆ నిజాలన్నీ బయటపెడుతుందా?