Actress Navya Nair: మహిళలు పూలు పెట్టుకోవడం.. అనాదిగా వస్తోన్న సంప్రదాయం. ముఖ్యంగా దక్షిణాదిలో తలకు పూలు పెట్టుకొని స్త్రీలు కనిపిస్తుంటారు. పండుగలు, ఫ్యామిలీ ఫంక్షన్ల సమయంలో తలకు గులాబి, సన్నజాజి, చామంతి, మల్లెలు వంటి పూలను పెట్టుకొని అందంగా ముస్తాబవుతారు. ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి కూడా మల్లెపూలు (జాస్మిన్) పెట్టుకుంది. దీని కారణంగా ఆమెకు ఏకంగా రూ.1.14 లక్షల జరిమానా విధించడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
అసలేం జరిగిందంటే?
కేరళకు చెందిన నటి నవ్య నాయర్.. మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా నిర్వహించిన ఓనం వేడుకల్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లారు. మెల్ బోర్న్ విమానశ్రయంలో దిగిన సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నటి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘నేను బయలుదేరే ముందు నా తండ్రి నాకు జాస్మిన్ పూలు (మల్లెలు) కొనిచ్చారు. వాటిని రెండు భాగాలుగా చేసి ఒక భాగం కొచ్చి నుంచి సింగపూర్ ప్రయాణానికి ధరించమన్నారు. ఎందుకంటే ఆ పూలు మధ్యలో ఎండిపోతాయి. మరొక భాగం నేను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్నాను. అక్కడి నుంచి మెల్‌బోర్న్ ప్రయాణంలో వాటిని ధరించాలనుకున్నాను’ అని చెప్పారు.
’28 రోజులు పట్టింది’
తాను అనుకున్నట్లుగానే మల్లెలు ధరించి మెల్ బోర్న్ విమానశ్రయం లో దిగినట్లు నవ్య నాయర్ తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో జాస్మిన్ పూలు ధరించడం చట్ట విరుద్దమని ఎయిర్ పోర్ట్ అధికారులు తనకు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. 15 సెం.మీ పొడవున్న జాస్మిన్ గజ్రా ధరించినందుకు తనకు AUD 1,980 (రూ.1.14 లక్షలు) జరిమానా విధించారని వాపోయారు. 28 రోజుల్లో ఆ మెుత్తం చెల్లించానని నటి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పూలు ధరించడంపై ఆస్ట్రేలియాలో నిషేదం ఉన్న సంగతి తనకు తెలియదని సోషల్ మీడియా పోస్ట్ లో నటి అన్నారు. తాను తెలియక ఆ తప్పు చేశానని చెప్పుకొచ్చారు.
View this post on Instagram
తనపై తానే సెటైర్లు
అంతకుముందు విమానంలో జాస్మిన్ గజ్రాతో దిగిన ఫొటోను సైతం నటి నవ్య నెట్టింట పంచుకున్నారు. ‘నేను ఆకాశంలో ప్రయాణిస్తున్నా. నేను ఈ ఓనంకు కేరళలో లేకపోయినా.. పండుగ వైబ్స్ ను నాతో తీసుకెళ్తున్నాను. ఇది నాకు సంతోషంగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ప్రస్తుతం ఉన్నా. మెల్‌బోర్న్ నేను వచ్చేస్తున్నా’ అంటూ నటి రాసుకొచ్చారు. తర్వాత నవ్య పూలు పెట్టుకొని తీసుకున్న వీడియో షేర్ చేస్తూ వ్యంగ్యంగా ఇలా రాశారు ‘జరిమానా చెల్లించే ముందు చేసిన షో-ఆఫ్ ఇదే’ అంటూ పేర్కొన్నారు.
Also Read: CPI Narayana: బీజేపీ – బీఆర్ఎస్ మధ్య సంబంధం ఉంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
నవ్య సినీ ప్రస్తానం
నవ్య ఫిల్మ్ కెరీర్ విషయానికి వస్తే.. ఆమె రెండు కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ గెలుచుకున్నారు. ఆమె సినీ ప్రస్థానం సిబి మలయిల్ దర్శకత్వం వహించిన ‘ఇష్టమ్’ (2001)తో మొదలైంది. ఆమె మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో అనేక హిట్ సినిమాల్లో నటించారు. నందనం, మతులిక్కిళుక్కం, కుంజికూనన్, కల్యాణరామన్, వెల్లితిర, గ్రామోఫోన్, పట్టణతిల్ సుందరన్, జలోత్సవం, సైరా, కన్నే మడంగుకా, సిల నేరంగళిల్, భాగ్యద బేలేగార తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు.