Digital Crop Survey: ఖరీఫ్ సీజన్ లో వివిధ రకాల పంటల సాగుపై జిల్లాలో ఐదు రోజుల క్రితం ప్రారంభమైన ‘డిజిటల్ క్రాప్ సర్వే'(Digital Crop Survey) కార్యక్రమం క్రమంగా జోరందుకుంటోంది. రైతు పంటల నమోదు (డిజిటల్ క్రాప్ బుకింగ్) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో పాటు విది విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి మొబైల్ యాప్ లో ఫొటోలతో సహా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లోని గద్వాల, అలంపూర్ నియోజక వర్గ పరిధిలో అధిక విస్తీర్ణంలో కమర్షియల్ పత్తి పంట సాగు చేస్తుండగా, మిరప,కంది, పొగాకు, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తుండగా జూరాల ఆయకట్టు, ఆర్డిఎస్, నెట్టెంపాడు లిఫ్ట్ ఎత్తిపోతల పథకం ద్వారా వరి పంటను అధిక విస్తీర్ణం సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం సర్వే చేపడుతున్నారు. సీజన్ ఆరంభానికి ముందే కురిసిన వర్షాలకు పత్తి పంటను సాగు చేయగా అనంతరం జూన్, జూలైలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఆగస్ట్ నెలలో కురిసిన వర్షాలకు సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని రైతులు చేరుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 97 క్లస్టర్ లకు గాను మొత్తం సాగు విస్తీర్ణం 3.94 లక్షల ఎకరాలలో వాణిజ్య, ఆహార పంటలను సాగు చేస్తున్నారు. నవంబర్ 1 నాటికి ఈ సర్వే పూర్తి చేయాల్సి ఉంది. సజావుగా సాగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
డిజిటల్ సర్వే ఇలా
సీజన్ లో ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి తమ క్లస్టర్ పరిధిలోని రైతులను ప్రత్యక్షంగా కలిసి వాస్తవంగా సాగులో ఉన్న పొలాన్ని పరిశీలించి ఆ వివరాలను మాత్రమే నమోదు చేయాలి. మహిళా ఏ.ఈ.ఓలు కనీసం 1,800 ఎకరాల్లో, మేల్ ఏఈఓలు కనీసం 2 వేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తారు. మిగిలిన వాటికి సాధారణ క్రాప్ బుకింగ్ పద్దతిలో చేస్తారు. ప్రతి పంటను ఫొటో తీసి అప్ లోడ్ చేయటం తప్పనిసరి. మొత్తాన్ని ఒకే మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేస్తారు. సర్వేలో వరి రకాల వివరాలు పేర్కొనటం తప్పనిసరి. ధాన్యం సేకరణ కోసం ఇది ఉపయోగపడుతుంది. స్వల్పకాలిక పంటలైన మినుము, పెసర, మొక్కజొన్న వంటి వాటిని ముందుగా నమోదు చేయనున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లేని, పోడు, దేవాదాయ భూముల్లో సాగు చేసే పంటలను రైతు పేరు, ఆధార్, ఫోన్ నెంబరు మొదలైన వివరాల సాయంతో నమోదు చేస్తారు.
సర్వేతో ఆహార ధాన్యాల లభ్యతపై స్పష్టత
దేశంలో ఏ పంట దిగుబడి ఎంత వస్తుందనే అంచనా వేయనున్నారు. దిగుబడులకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధరల నిర్ణయం తీసుకునేందుకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కచ్చితత్వంతో నష్ట నిర్ధారణకు, చీడపీడల ఉనికి, తగిన విధంగా రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. వ్యవసాయ పురోగతికి,అంచనాకు ఉపయోగపడుతుంది.
రైతు సమాచారం
క్రాప్ బుకింగ్ 90శాతం పూర్తి కాగానే రైతులకు సంక్షిప్త సమాచారం ద్వారా వివరాలు పంపిస్తారు. రైతు వివరాలు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రదర్శించాలి. నమోదులో తప్పులు దొర్లితే సరిచేయమంటూ రైతు దరఖాస్తు ఇవ్వాలి. ఏఈఓ మూడు రోజుల్లో సరి చేసి తుది జాబితా ప్రదర్శించాలి. క్షేత్రస్థాయిలో సర్వే పారదర్శకంగా సాగుతోంది. జిల్లా వ్యవసాయ అధికారి సక్రియం నాయక్ ప్రభుత్వం ఆదేశం మేరకు జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే ముమ్మరంగా సాగుతోంది. తప్పుగా నమోదైన వివరాలు సరిచేసేందుకు అవకాశం ఉంది. ఏఈఓలకు రైతులు సహకరించాలి.
Also Read: Gadwal Town: ఇళ్ల మధ్యనే కల్లు విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు