Gadwal district: సమృద్ధిగా వానలు కురువాల్సిన వర్షాకాలంలో ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతుండగా జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి సూర్యుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. గత పది రోజుల క్రితం అపుడప్పుడు అక్కడక్కడ చిరుజల్లులు ఎండ తీవ్రతను తగ్గించలేకపోవడంతో పగలు ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ కాస్తుండటంతో సామాన్య ప్రజలతోపాటు రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సాగునీళ్లందించేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. ఆగస్టులోనైనా భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు(Farmers) ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా
ఉదయం నుంచే వేడి,ఉక్కపోత
పగటిపూట ఎండ వేసవిని తలపిస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే సుర్రుమంటోంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడుతున్నా, గాలి వీయకపోవడంతో ఉక్కపోతతో ప్రజలు రాత్రంతా ఇబ్బందిపడుతున్నారు. ఇటు దినసరి కూలీలు సైతం కేవలం ఉదయం సాయంత్రం వేళలో పనులకు వెళ్తున్నారు.మే నెల కురిసిన వర్షాలు అనంతరం కేవలం అక్కడక్కడ చిరుజల్లులు తప్ప ఓ మోస్తరు వర్షం కురువక వరుణుడు ముఖం చాటేయడంతో క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది.
జ్వరాల బారిన జనం
జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ వాతావరణ ప్రభావంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, ఉక్కపోత కారణంగా చర్మవ్యాధులు, జ్వరం జలుబు, గొంతునొప్పి తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుధ్య లోపంతో వైరల్ జ్వరాలు వ్యాపించడంతో బాధితులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఆకాశంవైపు ఆశగా..
కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప వర్షాలు మాత్రం కురవడంలేదు. రోజూ ఆకాశంలో కమ్ముకుంటున్నా మేఘాలు వర్షించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలో మురిపించిన వరుణుడు అనంతరం ముఖం చాటేయడంతో జిల్లాలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరలేదు.
సాధారణం కన్నా లోటు వర్షపాతం నమోదు
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు జూన్ లో 83.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 72 4 మిల్లీమీటర్లు నమోదైంది.జులై నెలలో కురవాల్సిన 112.1 మిల్లీమీటర్ల వర్షానికి గాను కేవలం 96.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. ఎర్రవల్లి,ఇటిక్యాల, ధరూర్(Dharur,) మానవపాడు మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆయకట్టుకు సాగునీరు వదలడంతో వరి నాటు పనులు జోరు అందుకుంది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. సాగు చేసిన పంటలకు బోర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. విద్యుత్ డిమాండ్ పెరగడంతో లో వోల్టేజ్ సమస్య తలెత్తి మోటార్లు సైతం కాలిపోతున్నాయి. బావులు, బోర్లపై ఆధారపడిన రైతులు పత్తి,మిరప,ఉల్లి తదితర పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు కురవకపోతే బావులు, బోర్లు కూడా ఎండిపోతాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూగజీవాలకు సైతం సరైన పచ్చగడ్డి,నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ఈ నెలలోనైనా వర్షాలు కురిస్తే సాగు చేసిన పంటలు పూత, పిందె దశలో ఉన్నాయని, వర్షం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: TS News: ఖమ్మం కలెక్టరేట్‌లో డ్రైవర్.. ఎవరూ ఊహించని పనులు!