Forest Department: ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై గాజులమ్మ ఆలయం వద్ద అటవీ శాఖ నిర్లక్ష్యానికి జింక బలైంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన జింక, సుమారు రెండు గంటల పాటు ప్రాణాలతో విలవిలాడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ (Forest Department) అధికారులకు సమాచారం అందించినా, అధికారులు స్పందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకోవడంలో నిర్లక్ష్యం చూపిన ఫారెస్ట్ అధికారులు, చివరకు జింక ప్రాణాలు పోయే వరకు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సమయానికి ఫారెస్ట్ అధికారులు స్పందించి ఉంటే జింక ప్రాణాలు నిలిచేవి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటవీ శాఖ అధికారుల అలసత్వం
ప్రాణ రక్షణ బాధ్యత వహించాల్సిన అటవీ శాఖ అధికారుల అలసత్వం కారణంగా మరో వన్యప్రాణి ప్రాణం పోవడం దురదృష్టకరమని వారు మండిపడుతున్నారు. రహదారులపై వన్యప్రాణుల సంరక్షణపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకునే అటవీ శాఖ, వాస్తవ ఘటనల్లో మాత్రం చేతులు దులుపుకుంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

