Sridhar Babu: ప్రజల చెంతకే పాలన అందించేదే కాంగ్రెస్ ప్రభుత్వం అని, సుస్థిరంగా ప్రజలకు సుస్థిర పాలన అందించే ఘనత ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు అండ్ వాణిజ్యం శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. బుధవారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితమే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని తెలిపారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్లో విలీనమై నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలో కి అడుగిడుతున్నామన్నారు.
Also Read: Chit Fund Scam: చిట్టీల పేర రూ. 5 కోట్లతో పరారైన భార్యాభర్తలు. లబోదిబోమంటున్న బాధితులు
42 రోజులపాటు సకల జనుల సమ్మె
స్వాతంత్రం సిద్ధించాక హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారన్నారు. 1969 లోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, ఆ తర్వాత జోనల్ వ్యవస్థ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కాంక్షలు తీర్చలేదన్నారు. తెలంగాణ పై జరుగుతున్న అన్యాయాలను ఆపలేకపోయామని ఫలితంగా తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమై 2011 నుండి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నాయకత్వంలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు తీవ్ర ఉద్యమం చేశారని కొనియాడారు. తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలను ఫణంగా పెట్టి 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేశారని తెలిపారు. దీంతో సోనియాగాంధీ తెలంగాణ బిడ్డల త్యాగాలను, పోరాటాలను చూసి చలించిపోయారు.
ప్రజా పాలనలో ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుగమమం చేస్తూ 2014 జూన్ రెండవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరవీరులదేనని, అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, తెలంగాణ రాష్ట్రం కోసం జరిపిన మహోద్యమంలో అమరులైన తెలంగాణ బిడ్డలందరికీ నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పది సంవత్సరాలు తెలంగాణను తెగనమ్మి తీవ్ర ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనలో ప్రజల చెంతకే ప్రభుత్వ యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య పథకాలకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించామన్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన తెలంగాణ బ్రతికిస్తూ రాష్ట్ర ప్రజలను సైతం బ్రతికించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్విరామకృషి చేస్తోందన్నారు. ఓవైపు అప్పులు కడుతూనే తెలంగాణ సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు పనిచేస్తున్నారని వెల్లడించారు. అభివృద్ధి వైపు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంటే అభివృద్ధిని అడ్డుకునేందుకు టిఆర్ఎస్, బిజెపి పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
