Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) తొర్రూరు మండల పరిధిలోనీ ఇటుక బట్టీల దందా దారుణ స్థాయికి చేరింది. ప్రభుత్వ ‘డబుల్ బెడ్ రూమ్’ ఇండ్లను ఆసరాగా చేసుకుని కొందరు ఇటుక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు, మూడు నెలల క్రితం 12 నుండి 13 వేల రూపాయలకే లభించిన ఒక ట్రిప్పు ఇటుక ప్రస్తుతం 22 వేల రూపాయలకు ఎగబాకింది. ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు, ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటుక, ఇసుక ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతుండడంతో ఇల్లు కట్టుకోవాలన్న ప్రజల కలలే చెదిరిపోతున్నాయి.
Also Read: Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం.. 64.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు!
అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు
ప్రభుత్వం నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్లు కట్టిస్తున్నా, మిగిలిన నిర్మాణ ఖర్చులు కోసం ప్రజలు అప్పులు తెచ్చుకొని మరి ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే, ఇటుకల అధిక ధరలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజల్లో అసహనం పెరుగుతోంది. స్థానికుల మాటల్లో అక్రమంగా బట్టీలు నడిపి, అధికారుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు కూడబెడుతున్నారు. ఇసుక, ఇటుక వ్యాపారాలు నియంత్రణలో లేవు. పైగా, ఎవరూ పట్టించుకోవడం లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ రవాణాతో లక్షలు దండుకుంటున్నారు
ఇటుక బట్టీల యజమానులు అనుమతి లేకుండా పనిచేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు పెద్దలు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి అక్రమ రవాణాతో లక్షలు దండుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని ఈ ఇటుక బట్టి యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఇటుక ధరల ఆర్భాటం కొనసాగి, సాధారణ ప్రజల ఇల్లు కలను శాశ్వతంగా మట్టుబెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?
