Bhatti Vikramarka: మధిర మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. మధిర పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అన్నీ నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. సాయంత్రం మధిర క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన వివిధ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల ప్రగతిపై చర్చించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు మొదలుపెట్టారు, ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి, నిర్ణీత సమయానికి పూర్తి కావాలంటే మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ ఏ విధంగా స్పందించాలి అనే అంశాలపై డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు.
వాట్సాప్ ద్వారా సమస్యల పరిష్కారం
కింది స్థాయిలో పనిచేసే అధికారులు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని, ఉన్నతాధికారులు వాటిని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను డిప్యూటీ సీఎం సూచించారు. పనుల నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని, ఎప్పటికప్పుడు థర్డ్ పార్టీ ఏజెన్సీతో క్వాలిటీ చెక్ జరగాలని ఆయన ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరిగితే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని, ఆ పరిస్థితి ఏర్పడవద్దని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్ వార్డుల వారీగా పరిస్థితిని ఆయన సమీక్షించారు. పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన నిర్ణయాలు ఉంటాయని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ క్రమంలో స్థానికులు మంచి నీరు, వాహనాల రాకపోకల విషయంలో ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఒకవైపు, మరోవైపు వేగంగా, నాణ్యతతో పనులు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ వారి సిబ్బంది సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మధిర మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన నూతన భవన నమూనాలను కూడా పరిశీలించారు.

