BC Bandh: బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడం పై రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ పాలకుర్తి నియోజకవర్గం(Palakurthy Constituency)లో విస్తృతంగా జరిగింది. పాలకుర్తి, పెద్ద వంగర, దేవరుప్పుల, కొడకండ్ల, రాయపర్తి, తోరూర్ మండలాల్లోనీ వ్యాపార సంస్థలు, షాపులు, బస్సు డిపోలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
బీసీ రిజర్వేషన్ అమలు
ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లు నిలిచిపోవడంతో నిరాశకు గురైన బీసీ వర్గాలు బంద్‌ను విజయవంతం చేయాలని నిర్ణయించగా, అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు – బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), సీపీఐ(CPI), సీపీఎం(CPM), న్యూడెమోక్రసీ(New Democracy), ఎస్ఎఫ్‌ఐ(SFI) తదితర సంస్థలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. షాపుల దగ్గరికి వెళ్లి షాపులను ముసి వేయించారు. దీంతో పట్టణమంతా ప్రశాంత వాతావరణం నెలకొంది. బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు.
Also Read: Warangal District: నిబంధనలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
తొర్రూర్ బస్టాండ్ సెంటర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
తొర్రూరు పట్టణంలోని బీఆర్‌ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నాయకులు వేర్వేరు బైక్ ర్యాలీలు తీసుకెళ్లి వ్యాపార సంస్థలను మూసివేయాలని కోరారు. అయితే బస్టాండ్ సెంటర్ వద్ద ఇరు పార్టీల ర్యాలీలు ఎదురెదురుగా రావడంతో వాగ్వాదం చెలరేగింది. మాటామాటా పెరగడంతో తోపులాటకు దారి తీసింది. ఒక దశలో పరస్పర విమర్శలు, నినాదాలతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రెడ్డి వర్గ నాయకులు
ఈ ఘటన కారణంగా బస్టాండ్ పరిసర ప్రాంతంలో సుమారు కిలోమీటరుపాటు ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్‌కు అన్ని కులాలు మద్దతు తెలుపుతున్నప్పటికీ, ఏ పార్టీకి చెందిన రెడ్డి వర్గ నాయకులు మాత్రం బంద్ కార్యక్రమాల్లో కనపడకపోవడం స్థానికుల్లో చర్చకు దారితీసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రావడం వారికి ఇష్టం లేదా..? అంటూ ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు.ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: Harish Rao: పంచాయతీలు పెంచుకోవడానికే క్యాబినెట్ మీటింగ్: హరీష్ రావు
