Child Marriages: 18 ఏళ్ల వయస్సు నిండని బాలబాలికలకు జరిగే బాల్య వివాహాలు(Child marriages) వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తాయని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ మాడుగుల రమేష్(Ramesh) అన్నారు. హుజురాబాద్ మండలం, సింగపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు.
తెలిసి తెలియని వయసులో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకునే బాలికలకు తెలిసి తెలియని వయసులో వివాహాలు చేయడం వల్ల వారు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఇది వారి లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుకోవడమే కాక, అనేక అవకాశాలు కోల్పోయేలా చేస్తుందని తెలిపారు. బాల్య వివాహాల ప్రయత్నాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే, వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ – 1098 లేదా చైల్డ్ హెల్ప్ డెస్క్ – 9490881098 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
చట్ట ప్రకారం..
బాల్య వివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా చట్ట ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయని రమేష్(Ramesh)హెచ్చరించారు. పిల్లలకి పెద్దల మాదిరిగానే హక్కులు ఉన్నాయని, వారి హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత సమాజంలోని పెద్దలందరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్మాస్టర్ రాంప్రసాద్, ఉపాధ్యాయులు పుష్పలత, ఉమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: Konda Surekha: ధర్మపురి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
