Traveller: అతడో పేరు మోసిన ప్రపంచ యాత్రికుడు. నిత్యం ఏదోక దేశం తిరుగుతూ.. వీడియోలు చేస్తుంటాడు. ఆ దేశంలోని ప్రముఖ ప్రదేశాలు, ప్రజల జీవనశైలి, ఆధ్యాత్మిక ప్రాంతాలను కళ్లకు కడుతుంటాడు. ఇప్పటివరకూ 197 దేశాలు తిరిగిన ఆ ట్రావెలర్.. తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా ఒక జాబితాను రూపొందించాడు. కొత్త అనుభవాల ఆధారంగా ఉత్తమ దేశాలు, నగరాల జాబితా మారుతూనే వచ్చిందని.. కానీ తన దృష్టిలో ఒక ప్రాంతం మాత్రం వరస్ట్ గా అలాగే ఉండిపోయిందని ఆ ట్రావెలర్ తెలిపాడు. ఇంతకీ ఆ ప్రపంచ యాత్రికుడు ఎవరు? అతడు చెప్పిన వరస్ట్ నగరం ఏది? ఆ ఫీలింగ్ రావడానికి గల కారణాలు ఏంటీ? ఈ కథనంలో చూద్దాం.
ఆ ట్రావెలర్ ఎవరు?
ట్రావెలింగ్ ను ఇష్టపడేవారికి డ్రూ గోల్డ్ బర్గ్ (Drew Goldberg) ముఖం చాలా సుపరిచితం. డ్రూ బిన్‌స్కీ (Drew Binsky) పేరుతో అతడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ప్రపంచంలో అత్యధిక దేశాలను సందర్శించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో డ్రూ బిన్‌స్కీ కూడా ఒకరు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఇప్పటివరకూ తాను చూసిన అత్యుత్తమ దేశం, అస్సలు నచ్చని నగరం గురించి అతడు ప్రస్తావించాడు. తాను తిరిగిన దేశాల్లో ఫిలిప్పీన్స్ ది బెస్ట్ అని డ్రూ బిన్‌స్కీ తెలిపాడు. ఒక దేశానికి ఉండాల్సిన ప్రతీ లక్షణం ఫిలిప్పీన్స్ లో ఉన్నాయని కొనియాడాడు. అంతేకాదు యూరప్ దేశాలు తనకు బాగా నచ్చాయన్నాడు. ఒక్కో దేశాన్ని 3 సార్లకు పైగా సందర్శించానని తెలిపాడు.
వరస్ట్ నగరం అదేనట..
అయితే తనకు నచ్చని దేశాల గురించి కూడా డ్రూ బిన్‌స్కీ ప్రస్తావించాడు. లిబియా, హైతి, అఫ్గానిస్థాన్, గినియా, సోమాలియా దేశాల్లో పర్యటిస్తున్నంత సేపు తాను ఎంతో భయాందోళనకు గురైనట్లు చెప్పాడు. చాలా అసురక్షితంగా ఫీలైనట్లు తెలిపాడు. గినియా (Guinea) రాజధాని కోనక్రీ (Conakry) ఇప్పటివరకూ తాను చూసి వరస్ట్ నగరమని పేర్కొన్నాడు. ఎన్ని దేశాలు తిరిగినా.. ఆ నగరంపై తన అభిప్రాయం మారలేదని అన్నాడు. కోనక్రీ నగరంలో అడుగుపెట్టిన 10 నిమిషాలకే పోలీసులు తనను అడ్డుకున్నారని డ్రూ బిన్ స్కీ పేర్కొన్నాడు. తనను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారని చెప్పాడు.
Also Read: Delhi Blast Case: పిండి మిల్లు ఉపయోగించి, ఇంట్లోనే బాంబు తయారీ.. ఢిల్లీ పేలుడు కేసులో మరో సంచలనం వెలుగులోకి!
నగరంలో ట్రావెలర్ అనుభవాలు
పోలీసు వాహనంలో ప్రయాణిస్తూ.. కోనక్రీ నగరంలోని వీధులను చూశానని డ్రూ బిన్ స్కీ అన్నాడు. వీధులన్నీ భద్రతాబలగాల బారికేడ్లతో నిండిపోయిందని చెప్పాడు. ఎక్కడ చూసినా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన పోలీసులే కనిపించారని అన్నాడు. అదంతా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించిందని చెప్పాడు. అంతే కాకుండా నగరం మెుత్తం చెత్తతో నిండిపోయిందని.. దుర్గంధాన్ని భరించలేకపోయానని అన్నాడు. ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టడంతో ఆకలితో ఓ రెస్టారెంట్ కు వెళ్లానని డ్రూన్ బిన్ స్కీ తెలిపాడు. లోపల కూర్చున్న కొద్దిసేపటికే రెస్టారెంట్ సిబ్బంది తనను బయటకు పంపేసారని అన్నాడు. కోనక్రీ నగరం ఏమాత్రం ఆసక్తికరంగా తనకు అనిపించలేదని చెప్పారు. తన దృష్టిలో పర్యాటకులు వెళ్లకూడని ఏకైక ప్రదేశం కోనక్రీ నగరమని చెప్పుకొచ్చాడు.
