iBomma in SBI: ‘ఐబొమ్మ’ పైరసీ సినిమా వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రవి ఉన్నాడు. కొత్త సినిమాను ఏ విధంగా పైరసీ చేశారు? ఇందుకు సహకరించిన వ్యక్తులు ఎవరు? అన్న కోణంలో సైబర్ పోలీసులు.. రవిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐబొమ్మ వెబ్ సైట్ కు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ విషయం బయటపడింది.
ఎస్‌బీఐ సైట్‌లో పైరసీ లింక్స్..
ఐబొమ్మ రవిని పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులకు పట్టుబడటంతో ఇక ఐబొమ్మ పని అయిపోయినట్లేనని అంతా భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా.. ‘ఐబొమ్మ వన్’ (ibomma One) పేరుతో కొత్త సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ షాక్ లో ఉండగానే మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి అందులో పైరసీ లింక్స్ ను ఇమ్మడి రవి అందుబాటులో ఉంచినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
డౌన్ లోడ్ ఎలా చేస్తున్నారంటే?
ఇమ్మడి రవి అరెస్టుకు ముందు వరకూ ఐబొమ్మ లేదా బెప్పం పైరసీ సైట్స్ లో నేరుగా కొత్త సినిమాలను యూజర్లు చూసేవారు. రవి అరెస్ట్ తర్వాత.. ఆ సైట్ అందుబాటులో లేకుండా పోయింది. బెప్పం సైట్ ఓపెన్ చేస్తే కాపీ లింక్ ఆప్షన్ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఇక్కడి చాలా తెలివిగా ఆలోచించిన ఇమ్మడి రవి & కో.. ఎవరికీ అనుమానం రాకుండా ఎస్‌బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ పేరుతో ఏకంగా ఒక ఫేక్ పోర్టల్ ను సృష్టించింది. బెప్పంలో కాపీ చేసుకున్న లింక్స్ ను ఈ ఫేక్ ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్ లో కాపీ చేయడం ద్వారా పైరసీ చిత్రాన్ని డౌన్ లోడ్ చేసుకోనే వెసులుబాటును కల్పించింది. ఎస్‌బీఐ టర్మ్ ల్యాప్స్ (SBI Term Insurence Laps) పేరును గూగుల్ లో సెర్చ్ చేయగానే ఈ ఫేక్ పోర్టల్ ఓపెన్ కావడం గమనార్హం.
Is it true Rama krishna pic.twitter.com/jZ06bs6OkT
— 🅿🅽🆁🚩🚩🚩 (@PNRHindu) November 20, 2025
అవాక్కైన పోలీసులు..!
ఓవైపు ఐబొమ్మ, బప్పం సైట్లను కట్టడి చేయాలని పోలీసులు ప్రయత్నిస్తుంటే ఇమ్మడి రవి & కో.. కొత్త పోర్టల్స్ ను క్రియేట్ చేసి మరీ పైరసీని విస్తరిస్తుండటం దర్యాప్తు అధికారులకు తలనొప్పిగా మారింది. అది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ పేరుతో ఫేక్ పోర్టల్ ను క్రియేట్ చేయడం చూసి దర్యాప్తు అధికారులు సైతం అవాక్కైనట్లు సమాచారం. అయితే ఆ ఫేక్ ఎస్‌బీఐ పోర్టల్ కు సైతం చెక్ పెట్టే విధంగా సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు తమ పేరుతో ఫేక్ పోర్టల్ ను క్రియేట్ చేసిన విషయం.. ఎస్‌బీఐ అధికారులకు తెలుసా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపి.. వారిని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
