Passwords leaked: ఇంటర్నెట్ చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘన (Data Breach) నమోదయ్యింది. ఆన్‌లైన్ వేదికగా ఏకంగా 1600 కోట్లకు పైగా పాస్‌వర్డ్స్ లీక్ అయ్యాయి. ఈ లీక్‌తో కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్ల వ్యక్తిగత డేటాకు ముప్పు పొంచివుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఫిషింగ్ స్కామ్‌లు, ఐడెండిటీ చోరీలు, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్‌కు దారితీసే అవకాశం ఉందని సైబర్‌న్యూస్, ఫోర్బ్స్ రిపోర్టులు హెచ్చరించాయి. గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది పాత డేటా డంప్ కాదని డేటా సెక్యూరిటీ పరిశోధకులు చెబుతున్నారు. లీక్ అయిన పాస్‌వర్డ్స్ చాలా వరకు కొత్తవి అని, బాగా మెనేజ్ చేసినవేనని పేర్కొన్నారు. ఇన్ఫోస్టీలర్లుగా పిలిచే ఒక రకమైన మాల్వేర్ ద్వారా ఈ భారీ డేటాను సేకరించారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మాల్వేర్ ప్రోగ్రామ్స్ గుట్టుచప్పుడు కాకుండా డివైజ్‌ల నుంచి యూజర్లు పేర్లు, పాస్‌వర్డ్‌లను దొంగిలించి హ్యాకర్లకు పంపుతాయని, హ్యాకర్లు వాటిని నేరుగా ఉపయోగించడం లేదా, డార్క్ వెబ్ ఫోరమ్‌లలో విక్రయానికి పెడతారని పేర్కొన్నారు.
Read this- Klinkara Birthday: మెగా ఫ్యాన్స్ కోసం క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన..
ఏయే పాస్‌వర్డ్స్ ఉన్నాయి?
లీక్ అయిన డేటాలో గూగుల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మొదలుకొని, గిట్‌హబ్‌లోని (GitHub) డెవలపర్ అకౌంట్స్, కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ల పాస్‌వర్డ్స్ కూడా లీక్ అయ్యాయి. సేవలు అందించే ఎన్నో పోర్టల్స్ డేటా చోరీకి గురైనట్టు కథనాలు పేర్కొంటున్నాయి. తస్కరించిన డేటాను వెబ్‌సైట్ లింక్, ఆ తర్వాత యూజర్ పేరు, పాస్‌వర్డ్స్ క్రమంలో భద్రపరచుకున్నారు. వినియోగానికి సులభంగా ఉండేలా హ్యాకర్లు ఈ విధంగా భద్రపరిచినట్టుగా తెలుస్తోంది.
ఇంతపెద్ద మొత్తంలో డేటా ఉల్లంఘన జరగడాన్ని ‘ప్రపంచ సైబర్ నేరాలకు బ్లూప్రింట్ (ప్లానింగ్)’ వంటిదని సైబర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దగ్గరదగ్గరగా 30 పెద్ద డేటా సెట్‌ల నుంచి డేటాను దొంగిలించారని, ఒక్కో డేటా సెట్‌లో మిలియన్ల నుంచి బిలియన్ల వరకు పాస్‌వర్స్డ్ ఉంటాయని, మొత్తం కలిపితే 16 బిలియన్లకు పైగా పాస్‌వర్డ్స్ తస్కరణకు గురైనట్టు ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు వివరించారు.
Polavaram Project: పోలవరంతో తెలంగాణకు ముప్పు.. న్యాయ పోరాటానికి రెడీ.. కవిత వార్నింగ్!
అమ్మిపడేస్తారు
పెద్ద మొత్తంలో దొంగిలించిన డేటాను హ్యాకర్లు చిల్లర దుకాణంలో వస్తువుల మాదిరిగా విక్రయిస్తారనే నిజం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్దీగొప్పో టెక్నికల్ నాలెజ్డ్, కొంత మొత్తంలో డబ్బు ఉన్న వ్యక్తులు కూడా డార్క్ వెబ్ సైట్లలో ఈ పాస్‌వర్డ్‌ల ‘యాక్సెస్’ పొందవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాబట్టి, ప్రతి ఒక్కరికీ సైబర్ ముప్పు పొంచివున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. యూజర్ల నుంచి కంపెనీలు, సంస్థల వరకు దాదాపు ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే అంశమని విశ్లేషిస్తున్నారు.
పాస్‌వర్డ్స్ చౌర్యంపై సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇదివరకే హెచ్చరించింది. సాంప్రదాయక పాస్‌వర్డ్స్‌కు బదులు పాస్‌కీస్ వంటి మరింత సురక్షితమైన ఆప్షన్లకు మారాలని యూజర్లకు అప్రమత్తం చేసింది. ఎస్ఎంఎస్‌లు లేదా ఈ-మెయిల్స్‌కు వచ్చే లింకులపై అస్సలు క్లిక్ చేయవద్దని, ముఖ్యంగా, లాగిన్ వివరాలను కోరుతూ పంపించే లింక్స్‌పై ఏమాత్రం క్లిక్ చేయవద్దని అమెరికా దర్యాప్తు సంస్థ ‘ఎఫ్‌బీఐ’ కూడా ఇదివరకు హెచ్చరించింది.
యూజర్లు ఇప్పుడేం చేయాలి?
పెద్ద సంఖ్యలో పాస్‌వర్డ్స్ లీక్ అయిన నేపథ్యంలో, యూజర్లు తమను తాము కాపాడుకునే చర్యలు వెంటనే మొదలుపెట్టాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన అన్ని అకౌంట్ల పాస్‌వర్డ్‌లను మార్చాలని చెబుతున్నారు. పాస్‌వర్డ్స్ స్ట్రాంగ్‌గా, విభిన్నంగా ఉండేలా చూసుకోవాలని, అదేవిధంగా 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను (2FA) ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. డివైజ్‌లోని డేటా మొత్తం సేఫ్‌గా ఉంచుకునేందుకు ‘పాస్‌వర్డ్ మేనేజర్ యాప్’లను కూడా ఉపయోగించవచ్చని పేర్కొంటున్నారు. డార్క్ వెబ్ మానిటరింగ్ టూల్స్ ఉపయోగించి డేటా లీక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని సూచించారు. ఈ-మెయిల్ లేదా పాస్‌వర్డ్ ఏదైనా లీక్ అయినట్టుగా గుర్తిస్తే ఈ టూల్స్ అప్రమత్తం చేస్తాయని పేర్కొన్నారు.