Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకించామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి (Telangana jagruthi) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ లో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఏపీలో విలీనం అయిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
దేవుడు ఇక్కడ.. మాన్యం అక్కడ
పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముప్పు ఏర్పడిందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాచలం (Bhadrachalam Temple) రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని పేర్కొన్నారు. ‘వెయ్యి ఎకరాల దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయింది… దేవుడేమో తెలంగాణలో ఉన్నారు’ అని కవిత మండిపడ్డారు. ఆంధ్రాలో పట్టించుకునే వారు లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని చెప్పారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కవిత చెప్పారు.
న్యాయపోరాటానికి సిద్ధం: కవిత
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవసరమైతే న్యాయపోరటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను వ్యతిరేకించినట్లు కవిత చెప్పారు. పోలవరాన్ని ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి.. సుప్రీం కోర్టు (Supreme Court)ను సైతం ఆశ్రయించిందని అన్నారు. 2014లో ప్రధాని మోదీ (PM Modi) మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో ఏడు మండలాలను ఏపీ (Andhra Pradesh)లో కలపడానికి ఆర్డినెన్స్ ను ఆమోదించి అన్యాయం చేశారని విమర్శించారు. వాటితో పాటు లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజెప్పారని విమర్శించారు.
Also Read: Abhishek Bachchan: ఐశ్వర్య రాయ్‌తో విడాకులు.. సింగిల్ గా ఉండాలనిపిస్తోందంటూ అభిషేక్ బచ్చన్ పోస్ట్?
చంద్రబాబుపై ఫైర్
బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి సీఎం చంద్రబాబు (CM Chandrababu).. ఏడు మండలాలను తీసుకున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పట్లోనే పార్లమెంటులో గళమెత్తినట్లు పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ఎంపీలు (Congress MP’s) మాత్రం.. ఏమి పట్టనట్లు సైలెంట్ గా ఉండిపోయారని విమర్శించారు. 7 మండలాలు కలపడాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లోనే కేసీఆర్ (KCR) బంద్ కు పిలుపునిచ్చారని కవిత గుర్తుచేశారు. కానీ కేంద్రం (Central Govt) సైతం పట్టించుకోలేదని అన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని కవిత అన్నారు. దీనివల్ల భద్రాచలం రామాలయం మునిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.