Spain Woman: సాధారణంగా ఆఫీసుకు లేటుగా వచ్చేవారి పట్ల యాజమాన్యం చాలా కఠినంగా వ్యవహరిస్తుంటుంది. పలుమార్లు హెచ్చరించి ప్రవర్తనలో మార్పు రాకుంటే ఉద్యోగం నుంచి తీసివేసిన సందర్భాలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. అలాంటిది రోజూ చెప్పిన టైం కంటే ముందే వస్తున్న ఉద్యోగినిపై ఓ కంపెనీ వేటు వేసింది. స్పెయిన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అదే సమయంలో న్యాయపరమైన వివాదంగానూ మారింది.
అసలేం జరిగిందంటే?
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. 22 ఏళ్ల ఉద్యోగిని ఉదయం 7.30 గంటలకు పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఆమె పదే పదే 6.45కే ఆఫీసుకు రావడం కంపెనీ యాజమాన్యానికి నచ్చలేదు. నిర్దేశించిన సమయం కంటే ముందు రావొద్దని సదరు కంపెనీ పదే పదే ఉద్యోగినికి హెచ్చరించింది. అయినప్పటికీ ఆమె వినలేదు. అలాగే ఏడాది కాలం పాటు కంపెనీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ ఉద్యోగిని నడుచుకుంది.
ఖాళీగా ఉంచినప్పటికీ..
అయితే ఉద్యోగిని త్వరగా వచ్చిన ప్రతీసారి ఆమెకు మేనేజర్ పని చెప్పకుండా ఖాళీగా ఉంచడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆ ఉద్యోగిని త్వరగానే రావడాన్ని కంపెనీ చాలా సీరియస్ గా తీసుకుంది. కంపెనీ గైడ్ లైన్స్ పాటించని కారణంగా ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది. అయితే పనిచేయాలన్న ఉత్సాహంతో ఆమె ఆఫీసుకు వచ్చినట్లుగా తాము భావించడం లేదని మేనేజర్లు పేర్కొన్నారు.
కోర్టుకు వెళ్లిన ఉద్యోగిని
కంపెనీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి చెందిన సదరు ఉద్యోగిని.. న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. అలికాన్టే సోషల్ కోర్టులో కంపెనీకి వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. తన పట్ల కంపెనీ అన్యాయంగా వ్యవహరించిందని ఉద్యోగిని ఆరోపించారు. అయితే అనేక హెచ్చరికలు జారీ చేసినా ఉద్యోగిని పట్టించుకోలేదని కంపెనీ కోర్టు ఎదుట వాదించింది. వాటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది.
Also Read: Rahul Vs Amit Shah: ఒత్తిడిలో అమిత్ షా.. చేతులు వణికాయ్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభలో దుమారం
కోర్టు ఏం చెప్పిందంటే?
ఉద్యోగిని తొలగింపుపై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె తొలగింపును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. సదరు ఉద్యోగిని చాలా త్వరగా ఆఫీసుకు రావడం సమస్య కాదని.. యాజమాన్యం హెచ్చరికలను పట్టించుకోకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య అని పేర్కొంది. ఇది వర్కర్స్ స్టాట్యూట్ ఆర్టికల్ 54 ప్రకారం ఉల్లంఘన అని అభిప్రాయపడింది. అయితే ఉద్యోగినికి వాలెన్సియా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

