IndiGo: ఇండిగో సంక్షోభం మెల్లి మెల్లిగా కుదుటపడుతోంది. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో జరిగిన ఫ్లైట్ ఆలస్యాలు, రద్దులతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులకు, ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ పరిహారం ప్రకటించింది. ఎయిర్‌లైన్ తాజాగా ప్రకటించిన నివేదిక ప్రకారం, తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10,000 విలువ చేసే ట్రావెల్ వోచర్లు ఇవ్వనున్నారు. ఇవి రీఫండ్‌లు, ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొన్న తప్పనిసరి పరిహారానికి అదనంగా అందించబడతాయి.
ఇండిగో ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని ముఖ్య విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి నిలిచిపోయారు, దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు పెద్ద స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి ప్రయాణికులకు ఈ వోచర్లు అందజేయనున్నారు. ఈ వోచర్లు వచ్చే 12 నెలల్లో ఇండిగోలో ఎలాంటి ప్రయాణానికైనా ఉపయోగించుకోవచ్చు.ఎయిర్‌లైన్ తెలిపిన ప్రకారం, ఇప్పటికే రద్దైన అన్ని ఫ్లైట్లకు రిఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రయాణికుల ఖాతాల్లో రీఫండ్ మొత్తం ప్రతిబింబించడం మొదలైంది. ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా టికెట్లు బుక్ చేసిన వారి రీఫండ్‌లు కూడా త్వరలో పూర్తవుతాయి.
Also Read: Lockdown Delay: మరో సారి రిలీజ్ ఆగిపోయిన అనుపమ పరమేశ్వరన్ ‘లాక్ డౌన్’.. నిర్మాతలు ఏం చెప్పారంటే?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బయలుదేరే సమయానికి 24 గంటల ముందు రద్దైన ఫ్లైట్లకు రూ.5,000 నుండి రూ.10,000 వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నియమిత పరిహారానికి అదనంగా తాజా ట్రావెల్ వోచర్‌లు ఇవ్వబడతాయని ఇండిగో స్పష్టం చేసింది. ఇక మరోవైపు, డిసెంబర్ 5న ఒకే రోజు 1,600 ఫ్లైట్లు రద్దయ్యే వరకు దిగజారిన ఆపరేషనల్ పరిస్థితులపై, డీజీసీఏ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను సమన్లు జారీ చేసింది. ఆపరేషనల్ అంతరాయాలపై పూర్తి నివేదికను సమర్పించాల్సి ఉంది.
ప్రస్తుతం ఇండిగో గురువారం రోజున 1,950 కంటే ఎక్కువ ఫ్లైట్లు నడపనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికే వింటర్ షెడ్యూల్‌లో ఎయిర్‌లైన్ ఆపరేషన్లను 10 శాతం తగ్గించింది, తద్వారా ఫ్లైట్ రద్దులను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇటీవలి కాలంలో ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నియమాలను అమలు చేయడంలో విఫలమైన కారణంగా ఇండిగోలో పెద్ద స్థాయిలో ఆపరేషన్ల అస్థిరత ఏర్పడింది. దాదాపు వేల సంఖ్యలో ఫ్లైట్లు రద్దయ్యాయి, ఆలస్యమయ్యాయి, దీనితో ప్రయాణికులపై భారీ ప్రభావం పడింది.

