Telangana Rising Summit 2025: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలో మరే ఇతర కొత్త నగర నిర్మాణానికి దక్కని అరుదైన ప్రాముఖ్యతను దక్కించుకున్నది. 13,500 ఎకరాల్లో సువిశాలంగా రూపుదిద్దుకోనున్న ఈ నగరం, కేవలం రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయంతోనే ప్రపంచ పారిశ్రామిక పటంలో కీలక గమ్యస్థానంగా నిలిచింది. ఈ సమ్మిట్‌లో 44 దేశాల ప్రతినిధులు హాజరు కావడం, రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరగడం ఫ్యూచర్ సిటీ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
సమ్మిట్‌తో ప్రపంచ స్థాయి గుర్తింపు
దేశంలో ఇప్పటికే అనేక స్మార్ట్ సిటీలు, కొత్త నగరాల నిర్మాణ ప్రతిపాదనలు దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేదికగా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించడం అనేది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ దార్శనికత, కార్యాచరణ వేగానికి నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమ్మిట్ ముగిసిన వెంటనే ‘ఫ్యూచర్ సిటీ’ కార్యరూపం దాల్చడానికి మార్గం సుగమమైంది.
మౌలిక సదుపాయాలు, డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఇన్ఫ్రా, ఎంటర్‌టైన్‌మెంట్, డిఫెన్స్, ఏఐ వంటి రంగాలకు లక్షల కోట్ల పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని నివాస కేంద్రంగా, వ్యాపార, పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, క్రీడలు, డేటా సెంటర్స్, అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరు విభాగాలుగా నిర్మించనున్నారు. ముఖ్యమైన నిర్మాణ ప్రక్రియలో భాగంగా, డేటా సెంటర్ల కోసం 400 ఎకరాలు కేటాయించారు. వచ్చే ఫిబ్రవరి చివరిలో నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కార్యక్రమాలు మొదలవుతాయి.
13 లక్షల మందికి ఉద్యోగాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షల మేరకు 13,500 ఎకరాల నగరాన్ని ‘జీరో కార్బన్ సిటీ’గా రూపొందించే లక్ష్యంతో అంతటా అర్బన్ ఫారెస్ట్‌లు, రెయిన్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో పరిశోధన, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు ఇక్కడ ఉంటాయి. ఈ నగరం సమగ్ర జీవన కేంద్రంగా ఉండనున్నది. 13 లక్షల మందికి ఉద్యోగాలు, 9 లక్షల జనాభా కోసం నివాస సముదాయాలు ఏర్పాటవుతాయి.
అంతేకాకుండా, రిలయన్స్ ఫౌండేషన్ ‘వంతార’తో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుతో పాటు, ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిక్ట్‌లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, రేసింగ్ ట్రాక్‌లు వంటి వినోద, క్రీడా సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అద్భుతమైన మౌలిక వసతులు, అత్యాధునిక రవాణా వ్యవస్థలతో ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలవనున్నది. సమ్మిట్ విజయం తర్వాత, దేశంలో ఏ కొత్త నగరానికి దక్కని ప్రాముఖ్యత ఈ ప్రాజెక్ట్‌కు దక్కింది. ఇది తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించనున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫ్యూచర్ సిటీపై మార్కెట్‌లో విలువ కూడా పెరిగింది. ప్రధానంగా ల్యాండ్ వాల్యూ అమాంతంగా పెరిగినట్లు సర్కార్ చెబుతున్నది.
రాజకీయ కోణం లేకుండానే..
గ్లోబల్ సమ్మిట్ వంద శాతం పొలిటికల్ కోణం లేకుండానే నిర్వహించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎక్కడా రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నించకుండా కేవలం పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన కోసం కృషి చేసినట్లు వివరిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించినట్లు గుర్తు చేస్తున్నారు. సమ్మిట్‌లు, కార్యక్రమాలు ఏం జరిగినా బీఆర్ఎస్ ఉండడం వలనే వచ్చినట్లు గొప్పగా చిత్రీకరించారని చురకలంటిస్తున్నారు. కానీ, తమ ప్రభుత్వ పనితీరు ప్రజల కోణంలోనే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

