Rahul Vs Amit Shah: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో (Parliament winter session) అధికార – విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సంస్కరణల అంశం తాజాగా మరోసారి లోక్‌సభలో రాజకీయ దుమారం రేపింది. గురువారం నాడు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ – కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల (Rahul Vs Amit Shah) యుద్ధం నడిచింది. ఎన్నికల సంస్కరణలపై బుధవారం లోక్‌సభలో జరిగిన వాదోపవాదాల సమయంలో అమిత్ షా ఒత్తిడికి గురైనట్టు కనిపించారని రాహుల్ గాంధీ అన్నారు. అమిత్ షా చాలా కంగారు పడ్డారని, ఆయన చేతులు వణికాయని ఆయన ఆరోపించారు. అమిత్ షా తప్పుడు బాషను కూడా ఉపయోగించారని, మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించారని, ఆయనను నిన్న మొత్తం చూసిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఓట్ల చోరీ అంశంపై మీడియా సమావేశంలో తాను మాట్లాడుతూ, అమిత్ షాకు నేరుగా సవాలు విసిరానని, కానీ ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదని రాహుల్ గాంధీ విమర్శల దాడి చేశారు. తాను మాట్లాడిన అంశాలను అమిత్ షా అసలు ఏమాత్రం ప్రస్తావించలేదని, ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని మండిపడ్డారు. నిజం ఏమిటో అందరికీ తెలుసని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Read Also- Akhanda 2: ‘అఖండ 2’కు షాకుల మీద షాకులు.. టికెట్ల ధరల హైక్, ప్రీమియర్ అనుమతి జీవో వెనక్కి!
రాహుల్‌కు అమిత్ షా కౌంటర్
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా నేరుగా స్పందించడంతో సభలో మాటల యుద్ధాన్ని తలపించింది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియను సమర్థించిన అమిత్ షా.. ప్రతిపక్షం తన ప్రసంగం ఎలా ఉండాలో నిర్దేశించలేదని కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ ఇష్టాల ఆధారంగా పార్లమెంటు పనిచేయదు’’ అని అన్నారు. తాను ఏ వరుసలో అంశాలు చెప్పాలో నిర్ణయించుకుంటానని, రాహుల్ గాంధీ ఓపికగా సమాధానం వినాలని పేర్కొన్నారు. తాను ప్రతి అంశానికీ సమాధానం చెబుతానని, అంతేగానీ తన ప్రసంగం క్రమాన్ని ఆయన నిర్ణయించలేరని అమిత్ షా మండిపడ్డారు. తన ప్రసంగం ఎలా ఉండాలో తమరు నిర్ణయించలేరని స్పష్టంగా చెప్పదలచుకున్నానంటూ ఫైర్ అయ్యారు. తాను గత 30 ఏళ్లుగా శాసనసభలు, పార్లమెంటుకు ఎన్నికవుతూ వస్తున్నానని, అపార అనుభవం ఉందని ప్రస్తావించారు. ముందు ఈ ప్రశ్న, లేదా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష నేత కోరుతున్నారని, ఇది సబబు కాదని అమిత్ అన్నారు.
నెహ్రూ మళ్లీ విమర్శల దాడి
దేశంలోకి అక్రమంగా వలస వచ్చినవారి ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక ఓట్ల సవరణ అవసరమని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా, గాంధీ – నెహ్రూ కుటుంబంపై అమిత్ షా మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశ మొట్టమొదటి ప్రధాని ఎన్నిక ఓట్ల దొంగతనానికి తొలి ఉదంతమని అమిత్ షా ఆరోపించారు. సోనియా గాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటు వేశారని ఆరోపించిన ఆయన.. ఈ మేరకు ఒక కోర్టు కేసు కూడా ఉందని ప్రస్తావించారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఆయన మాట్లాడుతుండగానే… రాహుల్ గాంధీతో పాటు, ఇతర ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అమిత్ షా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ, ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. పార్లమెంట్‌లో అమిత్ షా ఇచ్చిన సమాధానం కంగారు పడినట్టుగా, పూర్తి ఆత్మరక్షణ ధోరణిలో కనిపించిందని ఆయన విమర్శించారు.

