Viral News: ఇటీవల కాలంలో భర్తలను భార్యలు హత్య చేయడం లేదా హత్యాయత్నానికి పాల్పడడం లాంటి ఘటనలు (Viral News) దేశంలోని వివిధ ప్రాంతాల్లో వెలుగుచూస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ మహిళ తన మొగుడిని హత్య చేయించేందుకు పక్కా ప్లాన్ వేసింది. కానీ, భర్త అదృష్టం బావుండి చివరి నిమిషంలో చావుబతుకుల మధ్య ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య, ఆమె సోదరులు పురామాయించిన గూండాలు రాజీవ్ అనే వ్యక్తిని అడవిలో తీవ్రం గాయపరిచి వదిలేశారు. అతడి చేతులు, కాళ్లు విరగొట్టారు. అయితే, బాధిత వ్యక్తిని అడవిలో గుర్తించిన ఓ వ్యక్తి ఆస్పత్రికి తరలించాడు. దీంతో, అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ఇజ్జత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బాధితుడు రాజీవ్ ఒక డాక్టర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య సాధన అతడిని హత్య చేయించేందుకు ప్లాన్ వేసినట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరులైన భగవాన్ దాస్, ప్రేమ్‌రాజ్, హరీష్, లక్ష్మణ్‌తో పాటు మరో వ్యక్తితో కలిసి హత్య బాధ్యతను గూండాలకు అప్పగించినట్టు పోలీసు వర్గాల సమాచారం.
ప్రణాళికలో భాగంగా జులై 21న రాత్రి రాజీవ్ ఇంటిపై మొత్తం 11 మంది దాడికి పాల్పడ్డారు. రాజీవ్ చేతిని, రెండు కాళ్లు విరిగిపోయేలా తీవ్రాతి తీవ్రంగా కొట్టారు. రాజీవ్ బతికివుండగానే పూడ్చిపెట్టాలని కుట్ర పన్నారు. దారుణంగా కొట్టిన తర్వాత సీబీగంజ్ ప్రాంతంలోని అడవికి తీసుకెళ్లారు. ప్లాన్ ప్రకారం, ఒక గుంతను కూడా తవ్వారు. అయితే, రాజీవ్ విధి రాత దుండగులు చెరిపేయలేకపోయారు. రాజీవ్‌ను గోతిలో పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అసలు సిసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ప్రదేశం వైపుగా ఒక అపరిచితుడు వచ్చారు. దీంతో, భయపడిపోయిన నిందితులు.. రాజీవ్‌ను పూడ్చిపెట్టడాన్ని మధ్యలోనే ఆపివేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఆ సమయంలో రాజీవ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కాళ్లు, చేతులు విరిగిపోవడంతో తీవ్ర నొప్పులతో కదలలేని స్థితిలో పడిపోయి ఉన్నాడు. గట్టిగా అరిచే పరిస్థితి కూడా లేదు. అయితే, అక్కడికి చేరుకున్న ఆ అపరిచితుడు బాధితుడిని గుర్తించి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. ఆ విధంగా రాజీవ్‌ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తంగా అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Read Also- Yadadri Thermal Power: భూ నిర్వాసితులకు అన్నివిధాలా న్యాయం: డిప్యూటీ సీఎం
కేసు నమోదు..
బాధితుడు రాజీవ్ తండ్రి నేత్రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కోడలు సాధన, ఆమె సోదరులపై నేత్రామ్ ఫిర్యాదు చేశారు. తన కొడుకుని హత్య చేయాలని వారంతా కుట్ర పన్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, రాజీవ్, బరేలీలోని నవోదయ ఆస్పత్రిలో ఒక డాక్టర్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నాడు. 2009లో సాధనను వివాహం చేసుకున్నాడు. వారికి యశ్ (14), లవ్ (8) అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలిద్దరూ ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నారు. స్వగ్రామంలో రాజీవ్‌కు ఒక ఇల్లు ఉందని, అయినప్పటికీ, భార్యతో కలిసి నగరంలోనే నివాసం ఉండేవాడని తండ్రి వివరించారు. గ్రామంలో ఉండడం భార్యకు ఇష్టం లేకపోవడంతో నగరంలో నివాసం ఉంటున్నారని ఆయన వాపోయారు.