Yadadri Thermal Power: డిసెంబర్ నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అన్ని యూనిట్లను పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతికదన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్‌ను(800 మెగావాట్ల సామర్థ్యం) నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,(Uttam Kumar Reddy,) రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఇన్‌ఛార్జ్ మంత్రి లక్ష్మణ్ కుమార్,(Minister Laxman Kumar) మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)తో కలిసి ప్రారంభించారు.
ప్లాంట్ ఆవరణలో రూ.970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ పనులకు శంకుస్థాపన చేసి పరిసరాల్లో మొక్కలు నాటి అనంతరం వైటీపీఎస్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడువులోగా వైటీపీఎస్‌ను పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏడాదిలో రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్ ప్లాంట్ పరిసరాలను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు.
Also Read: Gadwal District: గురుకుల విద్యార్థుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు
అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు
ప్లాంట్ ఆవరణలో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల, ఆసుపత్రి నిర్మిస్తే పరిసర ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వాహనాల రద్దీ దృష్ట్యా రోడ్లు దెబ్బతిన్నందున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. పరిహారం, భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు.
పనుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం
గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తీసుకురావడంలో అలసత్వంగా వ్యవహరించిన కారణంగానే వైటీపీఎస్ నిర్మాణ పనులు రెండేండ్లు ఆలస్యమయ్యాయని భట్టి ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అన్ని అనుమతులు తీసుకువచ్చి అంకితభావంతో ఏడాదిలో రెండు యూనిట్లు పూర్తి చేశామని గుర్తు చేశారు. వైటీపీఎస్ భూ నిర్వాసితులను గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాసం కల్పించడం ప్రథమ ప్రాధాన్యంగా తీసుకున్నామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చిట్యాల మండల రైతులకు సైతం ప్రభుత్వం అన్నివిధాలా న్యాయం చేస్తుందని వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, విష్ణుపురం డబుల్ రైల్వే లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, రహదారుల నిర్మాణానికి ఇప్పటికే రూ.280 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ప్రతి ఉద్యోగికి కార్డుతోనే యాక్సెస్
ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, వైటీపీఎస్ అన్ని విభాగాల్లో లాగ్ బుక్ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతి ఉద్యోగి కార్డుతోనే యాక్సెస్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జెన్ కో సీఎండీ డాక్టర్ హరీశ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైటీపీఎస్ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.
Also Read: GHMC 1st Position: కుక్కల విషయంలో హైదరాబాద్ సంచలన రికార్డ్.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!