GHMC 1st Position: విశ్వాసానికి ప్రతీకగా చెప్పుకొనే శునకాల కేర్‌లో దేశంలోనే జీహెచ్‌ఎంసీ మొదటి స్థానంలో నిలిచింది. పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కల విషయంలోనూ ఎలాంటి తేడాల్లేకుండా జీహెచ్‌ఎంసీ సమదృష్టితో వ్యవహరించడం విశేషం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డు 2001 యాక్టును రెండేళ్ల క్రితం సవరించి అమలు చేస్తున్న జీహెచ్‌ఎంసీ, ప్రస్తుతం పెట్ లవర్స్‌ను ప్రోత్సహించేందుకు ఉచితంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అప్పటి వరకు అమలు చేసిన రూ.50 రిజిస్ట్రేషన్ ఫీజును ఎత్తేసిన జీహెచ్‌ఎంసీ, పెట్ రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేసినప్పటికీ, నిబంధనలను కొంత కఠినతరం చేసి అమలు చేస్తుంది. యాక్టును సవరించిన రెండున్నరేళ్ల నుంచి ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో సుమారు 14 వేల మంది తమ పెట్స్‌ను జీహెచ్‌ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటే యజమాని కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడే శునకాల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం ఐదు యానిమల్ పాండ్స్‌ను నిర్వహిస్తూనే, మరో రెండింటిని కొత్తగా అందుబాటులోకి తెచ్చేందుకు చేస్తున్న కృషి దేశంలోని ఇతర మహానగరాల్లోని స్థానిక సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక క్రిమిటోరియంలు, డాగ్ పార్కు
యజమాని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా, ఏళ్ల తరబడి జీవన ప్రయాణాన్ని కొనసాగించే శునకాలు మృతి చెందిన తర్వాత మనుషుల తరహాలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే జీహెచ్‌ఎంసీ సిటీలోని ఎల్బీనగర్ జోన్‌లోని ఫతుల్లాగూడ, కూకట్‌పల్లితో పాటు శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల ప్రాంతాల్లో మూడు ఎలక్ట్రిక్ క్రిమిటోరియంలను ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో పెట్స్ కోసం కూడా క్రిమిటోరియంలు ఏర్పాటు చేయాలని దేశంలోని ఇతర స్థానిక సంస్థల్లోని పెట్ లవర్స్ డిమాండ్ చేయడంతో, ఆ దిశగా స్థానిక సంస్థలు జీహెచ్‌ఎంసీలోని డాగ్స్ క్రిమిటోరియంలపై స్టడీ చేసి, అక్కడ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శునకాలు కూడా ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు వీలుగా సుమారు 1.2 ఎకరాల స్థలంలో డాగ్ పార్కును కూడా శేరిలింగంపల్లి జోన్‌లో ఏర్పాటు చేశారు. అంతేకాక, ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా పెరగడంతో దాహంతో అల్లాడిపోయే కుక్కలు ఫ్రస్ట్రేషన్‌కు గురై, జనాలను కాటు వేస్తున్నట్లు ఓ అధ్యయనంలో అధికారులు గుర్తించారు. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన వాటర్ పాండ్స్ మినహా జీహెచ్‌ఎంసీ తరఫున 7127 వాటర్ పాండ్స్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుక్కల నివారణ చర్యలు హైదరాబాద్‌లో పకడ్బందీగా జరగడంతో ఇప్పటి వరకు సిటీలో ఒక్క రెబీస్ కేసు కూడా నమోదు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రిజిస్ట్రేషన్ ఇలా..
పెట్ లవర్స్ కుక్కలను పెంచుకోవాలంటే జీహెచ్‌ఎంసీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పెట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లైసెన్స్ తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ సౌకర్యం కూడా కల్పించింది. ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌లోకి వెళ్లి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత యజమాని పేరు, చిరునామాను నమోదు చేయాలి. వెంటనే ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయగానే, డాగ్ బ్రీడర్ వివరాలతో పాటు ఫొటోను అప్‌లోడ్ చేయగానే యునిక్ నంబర్‌తో ఉచితంగా పెట్ లైసెన్స్ జనరేట్ అవుతుంది. ఈ లైసెన్స్ ఏడాది కాలం పాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే, వివరాలు నమోదు చేసే సమయంలోనే యాప్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఈ యాప్‌ను రూపకల్పన చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే విధంగా పైన ఇచ్చిన వివరాలు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌తో ప్రతి ఏటా లైసెన్స్‌ను ఎలాంటి ఛార్జీలు లేకుండానే రెన్యూవల్ చేసుకోవచ్చునని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ రకంగా జీహెచ్‌ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న పెట్ ఎవరినైనా కరిస్తే యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేలా కూడా నిబంధనలను కఠినతరం చేశారు. పెట్స్‌కు ఏటా వ్యాక్సినేషన్ చేయించుకునే బాధ్యత యజమానులదే.
పెట్ లవర్స్‌కు ప్రత్యేక సూచనలు..
జీహెచ్‌ఎంసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ పెట్ లవర్స్‌కి జీహెచ్‌ఎంసీ ముందు జాగ్రత్తగా కొన్ని సూచనలు జారీ చేసింది. గతంలో జీహెచ్‌ఎంసీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఓ ప్రత్యేకమైన బిల్లను శునకం మెడకు కట్టేవారు. ప్రస్తుతం ఆ నిబంధనను రద్దు చేసి, యూనిక్ నంబర్‌తో లైసెన్స్‌ను జారీ చేస్తున్నారు. జారీ సమయంలో పెట్ లవర్స్‌కు ప్రత్యేక సూచనలిస్తున్నారు. ముఖ్యంగా పెట్ లవర్స్ పెట్ మెడకు బెల్ట్‌ను, అలాగే పెట్ పారిపోకుండా ఓ తాడు (లీష్) లాంటిది వినియోగించాలని అన్నారు. డాబర్ మెన్ వంటి రకాలకు చెందిన పెట్స్ మూతికి మజిల్ లాంటిది పెట్టాలని సూచించారు. ఇతరుల మధ్యలోకి వెళ్ళినపుడు ఆ పెట్ ఎవర్నీ కరవకుండా ఉండేందుకు మజిల్ పెట్టాలన్న నిబంధనను విధించారు. పెట్స్ ను మల విసర్జన కోసం బయటకు తీసుకెళ్లినపుడు దాని మల విసర్జనపై వ్యక్తులు గానీ, కాలనీ సంక్షేమ సంఘాలు గానీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దన్న నిబంధన కూడా యానిమల్ వెల్ఫేర్ బోర్డులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ పెట్ విసర్జించిన మలాన్ని తొలగించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుని, అందుకయ్యే ఖర్చును పెట్ యజమాని భరించాల్సి ఉంటుందన్న నిబంధన కూడా ఉంది. అయితే, ఒక కాలనీలో ఎక్కువ పెట్స్ ఉంటే, మల విసర్జన తొలగించేందుకు కాలనీ సంక్షేమ సంఘం దాన్ని తొలగించేందుకు సొంతంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటును వెల్ఫేర్ బోర్డు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే నిబంధన కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు యూనిఫామ్‌గా వర్తించనుంది.
పెరిగిన వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ ఆపరేషన్లు..
మూడేళ్ల క్రితం నగరంలోని పలు ప్రాంతాల్లో కుక్క కాట్లు సంభవించడంతో జీహెచ్‌ఎంసీ వీధి కుక్కలపై దృష్టి సారించింది. అంతకు ముందు నుంచే మహానగరంలో కుక్కల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 400 మంది ఔట్‌సోర్స్ డాగ్ క్యాచర్స్, సూపర్‌వైజర్స్, 49 డాగ్ వ్యాన్ వెహికల్స్, ఆరు జోన్లకు ఆరు క్యాటిల్ క్యాచింగ్ వాహనాలకు తోడు అదనంగా వాహనాలను సమకూర్చుకుని, నివారణ చర్యలను ముమ్మరం చేసింది. సిటీలో మొత్తం 4 లక్షల 90 వేల వరకు కుక్కలున్నట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ వీటిలో అన్నింటికి ఏటా వ్యాక్సినేషన్ తో పాటు కుక్కల సంఖ్యను అదుపు చేసేందుకు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించేందుకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లను ముమ్మరం చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో రోజుకు 220 వరకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, మరో 490 కుక్కలకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసిన శునకాన్ని ఐదు రోజుల పాటు అబ్జర్వేషన్ లో పెట్టి, దానికి చక్కటి ఆహారాన్ని, మందులను ఇచ్చి, అది కోలుకున్న తర్వాత, దానికి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసినట్లు చెవిని కత్తిరించి, తీసుకువచ్చిన ప్లేస్ లోనే ఆ కుక్కలను వదిలేస్తున్నారు. దీంతో ఆ కుక్క ఎవర్నీ కరిచినా, ఎలాంటి ప్రమాదం లేదని, ఇక దానికి సంతానోత్పత్తి శక్తి లేకపోవడంతో కుక్కల సంఖ్య అదుపులో ఉంటుందని అధికారులు అంటున్నారు.
Also Read: Ind vs Pak WCL 2025: పాక్‌తో సెమీస్ బాయ్‌కాట్.. ఫైనల్‌కు వచ్చినా ఇదే చేసేవాళ్లం.. భారత జట్టు!
స్పెషల్ డ్రైవ్‌లోనూ కుక్కలపై దృష్టి..
హైదరాబాద్ మహానగరంలో తరుచూ వర్షాలు కురుస్తున్న కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ముందు జాగ్రత్తతో జీహెచ్‌ఎంసీ ఈ నెల 29వ తేదీ నుంచి శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఈ డ్రైవ్‌లో కూడా వెటర్నరీ విభాగం సిబ్బంది, అధికారులు ఫీల్డు లెవెల్ విధులు నిర్వహిస్తూ, వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయడంతో పాటు స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయని కుక్కలను గుర్తించి, వాటికి ఆపరేషన్లు చేస్తున్నారు. డ్రైవ్ ప్రారంభమైన ఈ నెల 29వ తేదీ ఒక్క రోజే 493 కుక్కలకు వ్యాక్సినేషన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం కూడా ఈ డ్రైవ్ కొనసాగింది.