Snake in Metro: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ మెట్రో రైల్ కార్పొరేషన్లు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లేడీస్ కోచ్‌లలో అయితే మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఢిల్లీ మెట్రోకి చెందిన ఓ రైల్ లేడీస్ కోచ్‌లోకి పాము ప్రవేశించిందంటూ ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. కోచ్‌లోని మహిళలు సీట్లపైకి ఎక్కి అరుస్తుండడం, తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపించడంతో పాము ప్రవేశించిన మాట నిజమేనేమో అనిపిస్తుంది. దీంతో, ఈ వీడియో క్లిప్‌ను చూసి మిగతా చాలా మంది మెట్రో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్యాసింజర్లకు భద్రత లేదా? అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మెట్రో ప్యాసింజర్లను ఆందోళనకు గురిచేసిన ఈ వైరల్ వీడియోపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది.
Read this- Viral News: కోడలు పారిపోయిందన్నారు.. దర్యాప్తులో సంచలనం!
ఢిల్లీ మెట్రో ప్రకటన ఇదే
వైరల్‌గా మారిన వీడియోలో నిజం కాదని, రైలులో పాము కనిపించలేదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటన చేసింది. ఒక బల్లి పిల్లని గుర్తించామని పేర్కొన్నారు. ‘‘లేడీస్ కోచ్‌లో పాము కనిపించిందంటూ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. రైలుని క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దింపి డిపోకు పంపించాం. సంబంధిత విభాగానికి చెందిన టీమ్ రైలు ఫుటేజ్ ఆధారంగా కోచ్‌ను నిశితంగా తనిఖీ చేసింది. ఎలాంటి పాము కనిపించలేదు’’ అని ఎక్స్ వేదికగా డీఎంఆర్‌సీ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘డీఎంఆర్‌సీ ప్రయాణీకుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రయాణికుల ఆందోళనను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకున్నాం. ప్యాసింజర్లు అప్రమత్తంగా ఉండాలి. ఆందోళనకర పరిస్థితులు ఏవైనా ఎదురైతే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం’’ అని అభ్యర్థించింది.
Read this- Kaushik Reddy Arrest: ఆస్పత్రిలో కౌశిక్ రెడ్డి.. బయట రచ్చ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు!
షాక్‌లో ప్రయాణికులు
ఢిల్లీ మెట్రో మహిళల కోచ్‌లోకి పాము నిజంగానే ప్రవేశించిందనుకొని మహిళా ప్యాసింజర్లు షాక్‌కు గురయ్యారు. భయంతో అరుస్తూ, ఒకరినొకరు పట్టుకోవడం, సీట్లపైకి దూకుతున్న దృశ్యాలు వైరల్ వీడియో క్లిప్‌లో కనిపించాయి. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. దీంతో, ఇతర ప్రయాణికులు కూడా బాగా భయపడ్డారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మెట్రో ఇకపై వన్యప్రాణుల సఫారీ లాంటిది. ఇకపై మెట్రో కాదు, ఇది ఒక సర్కస్’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. కాగా, పాము వచ్చిందంటూ ఆందోళనకు గురైన సమయంలో తాను అదే కోచ్‌లో ఉన్నానని ఓ మహిళ చెప్పారు. ఆ సమయంలో తాను రైలులోనే ఉన్నానని, ఎవరో బల్లిని చూసి పాము అని అరిచారని ఆమె చెప్పారు. దీంతో, అందరూ ఆందోళనకు గురయ్యారని ఆమె వివరించారు.