Viral Video: ముంబై బోరివలి రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి ఒంటరిగా బెంచ్‌పై కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేవలం ఒక ఘటనను కాదు, పురుషుల మానసిక ఆరోగ్యంపై సమాజంలో కొనసాగుతున్న చర్చను మరింతగా ముమ్మరం చేసింది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఆవేదనలో ఉన్నట్లు కనిపించాడు. “ పురుషులు తమ భావాలను అంత సులభంగా బయటపెట్టుకోలేరు.. ఎవరికీ చెప్పుకోలేరు.. వారు ఎక్కువగా నిశ్శబ్దంగా ఏడుస్తారు” అనే క్యాప్షన్‌తో ఈ క్లిప్ వైరల్ అయ్యింది. మరో లైన్‌లో “పురుషులు కూడా మనుషులే… వారి మౌనపోరాటం ఎవరికీ కనిపించదు” అని రాయడంతో మరింత చర్చకు దారితీసింది.
కారణాలు తెలియకపోయినా, సమస్య మాత్రం స్పష్టమే
ఆ వ్యక్తి ఎందుకు బాధలో ఉన్నాడు అన్నది తెలియకపోయినా, ఈ వీడియో పురుషులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, మానసిక సమస్యలు, వృత్తి పరమైన డిప్రెషన్, అలాగే పురుషులపై జరుగుతున్న దాడులు, వేధింపులు వంటి విషయాలను మరోసారి హైలైట్ చేసింది.
సోషల్ మీడియాలో వేల కామెంట్స్
ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. వేలాది మంది తమ కథలను, భావాలను పంచుకుంటూ పురుషుల మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరగాలని కోరుతున్నారు. ఒక యూజర్ రాసిన కామెంట్ ప్రత్యేకంగా ఉంది. “ఎంత కష్టంలో ఉన్నా కన్నీళ్లు కార్చొద్దని చెప్పే సమాజంలో.. మనసు విరిగినా నిశ్శబ్దంగా కూర్చోవాల్సిందే” అని రాయగా. మరొకరు వ్యాఖ్యానిస్తూ “ఈ బాధను నిజంగా ఎవరూ అర్థం చేసుకోలేరు.. ” అని విచారం వ్యక్తం చేశారు. కొంతమంది యూజర్లు, మానసిక ఆరోగ్యంపై చర్చలు పెరిగినా, పురుషులు ఇప్పటికీ తమ సమస్యలను బహిరంగంగా చెప్పేందుకు వెనుకడుగు వేస్తారని అభిప్రాయపడ్డారు. ఒక కామెంట్ ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. ” ఇది ఒక మహిళ అయితే అందరూ ఆమె దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఒక పురుషుడు ఏడిస్తే ఒక్కరూ కూడా పక్కన ఉండరని ” రాసుకొచ్చాడు.
పురుషుల మానసిక ఆరోగ్యంపై మరింత చర్చ జరగాలి!
ఈ వీడియో వైరల్ అవుతున్న క్రమంలో , పురుషుల భావోద్వేగాలు కూడా అంతే ముఖ్యమని, కన్నీళ్లు కార్చడం బలహీనత కాదని గుర్తు చేస్తున్నది. నిజమైన శక్తి అంటే బాధను దాచుకోవడం కాదు, దాన్ని ఎదుర్కొనే ధైర్యం అని నెటిజన్లు చెబుతున్నారు. ఈ ఘటనతో పురుషుల మానసిక ఆరోగ్యంపై మరింత చర్చ జరగాలని, సమాజం దృష్టి మారాలని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Men can't even show their emotions.
Nobody cares about men. pic.twitter.com/sHZAiFZVzx
— ︎ ︎venom (@venom1s) November 16, 2025
