D Mart Shopping Scam: సాధారణంగా డీమార్ట్ అనగానే ప్రతీ ఒక్కరికి ఆఫర్సే గుర్తుకు వస్తాయి. కిరాణా స్టోర్స్, ఇతర మార్ట్స్ తో పోలిస్తే తక్కువ ధరకు డీమార్ట్ లో సరుకులు లభిస్తాయని చాలా మంది నమ్మకం. అంతేకాదు ఒక్కో వస్తువుపై 10-50 వరకూ డిస్కౌంట్, బై వన్ గెట్ వన్ ఆఫర్స్, పండుగ సేల్స్ ఇలా కస్టమర్స్ ను ఆకర్షించేందుకు డీమార్ట్ నిర్వాహకులు ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆఫర్ల పేరుతో డీమార్ట్ మోసం చేసిందంటూ వినియోగదారులు పెట్టిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. డీమార్ట్ తమను ఏ విధంగా మోసం చేసిందో వారు స్ఫష్టంగా వివరించారు.
బై వన్ గెట్ వన్ పేరుతో చీటింగ్!
డీమార్ట్ లో తనకు జరిగిన మోసం గురించి ఓ కస్టమర్ పెట్టిన వీడియో అందరినీ ఆలోచనలో పడేసింది. ‘మావ బైట్స్’ ఇన్ స్టాగ్రామ్ పేజీ నుంచి షేర్ అయిన వీడియోలో కస్టమర్ మాట్లాడుతూ తనకు జరిగిన మోసం గురించి వివరించారు. వీడియోలో కస్టమర్ మాట్లాడుతూ తాను కప్ నూడిల్స్ కొనడానికి వచ్చినట్లు చెప్పారు. ‘బై వన్ గెట్ వన్’ (Buy One Get One) ఆఫర్ ఉండటంతో కొనుగోలు చేసి.. బిల్ కూడా వేయించినట్లు చెప్పారు. అయితే బయటకు వెళ్లి చూసుకుంటే తాను మోసపోయినట్లు అర్ధమైందని కస్టమర్ అన్నారు. నూడిల్స్ డబ్బాలు బై వన్ గెట్ వన్ కింద రూ.40 ధరను నిర్ణయించినట్లు వీడియోలో కస్టమర్ చెప్పారు. అంటే ఒక్కో కప్ ధర రూ.20 ఉండాలి. కానీ తనకు ఒక కప్ రూ.30 ఛార్జ్ చేశారని సదరు కస్టమరు వాపోయారు. లోపలికి వచ్చి ప్రశ్నించగా.. ఆఫర్ అప్లై కాదని ప్లేటు ఫిరాయించారని పేర్కొన్నారు.
View this post on Instagram
డిస్కౌంట్ పేరుతో మోసం..
మరొక వీడియోలో మహిళ మాట్లాడుతూ తాను డీమార్ట్ లో ఏ ఏ విధంగా మోసపోయారో తెలియజేశారు. డీమార్ట్ లో ఫ్రాడ్ జరుగుతుందని ఇన్నాళ్లు విన్నామని.. ఇప్పుడు దానికి బాధితులుగా మారమని వీడియో ప్రారంభంలో మహిళ చెప్పడం గమనార్హం. వీడియో ప్రకారం.. డీమార్ట్ కు వెళ్లిన సదరు మహిళ.. సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్ టాప్ లోడ్ 6 కేజీ (Surf excel Matic Top Load 6KG) బాక్స్ ను కొనుగోలు చేశారు. బిల్లులో రూ.1,115 వేశారని ఆమె తెలిపారు. దాని అసలు రేటు వచ్చి రూ.1,370 అని పేర్కొన్నారు. అయితే కొనుగోలు చేసేటప్పుడు రూ.450 డిస్కౌంట్ అని బోర్డు పెట్టారని మహిళ తెలిపారు. దీని ప్రకారం ఆ డిస్కౌంట్ (రూ.450) పోతే రూ.970కి బాక్స్ రావాలని కానీ వాళ్లు మోసం చేసి రూ.1,115 బిల్ వేశారని వాపోయారు. మనం ఆఫర్ ఉందని ఆలోచించకుండా తీసేసుకుంటున్నామని.. బిల్ దగ్గరకు వచ్చేసరికి వారు నచ్చిన అంకెను వేసుకుంటున్నారని మహిళ ఆరోపించారు. తన భర్త ఈ మోసాన్ని గమనించి గట్టిగా ప్రశ్నించడంతో.. డిస్కౌంట్ ను సరిచేసి మరో బిల్ ఇచ్చారని ఆమె వివరించారు.
View this post on Instagram
Also Read: Jubilee Hills Bypoll: కాంగ్రెస్ డబ్బులు పంచుతోంది.. ఈసీ పట్టించుకోవట్లేదు.. హరీశ్ రావు ఫైర్
క్రాస్ చెకింగ్ తప్పనిసరి..
అయితే డీమార్ట్ ఆఫర్ల విషయంలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టిన ఆఫర్లకు.. బిల్లులో వేసిన ధరలకు సంబంధం లేకపోతుండటంతో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని స్పష్టం చేస్తున్నారు. కౌంటర్ వద్ద బిల్ వేయించిన తర్వాత అక్కడే ఉండి ఒకసారి చెక్ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. డీమార్ట్ నిర్వాహకులు పెట్టిన ఆఫర్లు సరిగా అప్లై అయ్యాయో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా పొరపాటు దొర్లితే వెంటనే నిర్వాహకులు దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకునే వీలు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి డీమార్టులో తరుచూ నిత్యవసరాలు కొనేవారు బిల్లుపై ఓ కన్ను వేసి ఉంచితే బెటర్.
