Local Body Elections: స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి దాదాపు 21 నెలలు దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో, పోటీదారులుగా ఉన్న వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, కోర్టు కేసు కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
Also Read: Local Body Elections: గ్రామాల్లో ఊపందుకున్న స్థానిక ఎన్నికలు.. మద్దతు ఇస్తే మాకేంటి అంటున్న వర్గాలు
రిజర్వేషన్ల వివాదంతో జాప్యం..
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేయగా, ఆ నోటిఫికేషన్‌పై కోర్టు కేసు వేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఎన్నికలపై స్థానికులు పెట్టుకున్న గంపెడు ఆశలు నిరాశకు గురయ్యాయి.
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో అత్యధికులు రియల్ వ్యాపారులే ఉంటున్నారు. ఎన్నికలు వస్తే ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీరంతా పెట్టుబడులను, నగదును నిల్వ పెట్టుకోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగడం లేదని ప్రచారం నడుస్తుంది. ఎన్నికలు జరిగిన తర్వాతే రియల్ వ్యాపారం మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
రంగారెడ్డి జిల్లాలో తగ్గిన స్థానాలు..
మున్సిపాలిటీలకు సమీపంలో ఉన్న గ్రామాలను పురపాలికల్లో విలీనం చేయడంతో రంగారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.
జిల్లా గతంలో (ఎంపీటీసీ స్థానాలు) ప్రస్తుతం (ఎంపీటీసీ స్థానాలు) ప్రస్తుతం (జెడ్పీటీసీ స్థానాలు)
రంగారెడ్డి 258 230 21
వికారాబాద్ 224 227 20
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, గండిపేట మండలాలను ప్రభుత్వం పూర్తిగా అర్బన్ మండలాలుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేవు.
ఉపఎన్నిక తర్వాతే సమరం..
ప్రస్తుతం రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరుగుతుండటం వల్ల ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గురించి పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఈ ఉపఎన్నిక ముగిసిన వెంటనే స్థానిక సమరంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్ విధానాల ఫలితంగా 42 శాతం ఇవ్వలేకపోవచ్చని చెప్పే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది.
Also Read: Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు.. నోటిఫికేషన్ డేట్ ఫిక్స్!
