Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలుకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
ఎంపీటీసీలకు మండల ఆఫీస్లో, జడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్వోను నియమించినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ నుంచి అభ్యర్థుల రిజల్ట్ వచ్చే వరకు పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించారు. నామినేషన్ పత్రాలతోపాటు స్క్రూట్ని చేపట్టనున్నారు. మొదటి విడతలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్లు స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారులు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులు, రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
12,733 గ్రామపంచాయతీలు
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో గల 565 మండలాలు ఉన్నాయి. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు, 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలకు 31300 పోలింగ్ స్టేషన్లు, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ లోకేషన్స్ 15302, గ్రామపంచాయతీ ఎన్నికలకు 112474 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16703168 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఐదు దశల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
తొలి విడుత 53 .. రెండో విడుత 50 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు
తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నెల 23న తొలి విడత, 27న రెండో విడత ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. 13న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి విడతలో 53 రెవెన్యూ డివిజన్లలో 292 మండలాల్లో గల 2,963 ఎంపీటీసీలకు, 292 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 50 రెవెన్యూ డివిజన్లలో 2,786 ఎంపీటీసీ, 273 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు..
మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 17న తొలి విడత, 21న రెండో విడత, 25న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను జారీ కానున్నది. పంచాయితీ ఎన్నికలకు తొలి విడత 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు అదే రోజు వెలువడనున్నాయి. అయితే, తొలిఫేజ్లో 78 మండలాల్లో 1,991 గ్రామపంచాయతీలకు, 1,7200 వార్డులకు, సెకండ్ ఫేజ్లో 245 మండలాల్లోని 5,411 పంచాయతీలు, 47,846 వార్డులకు, థర్డ్ ఫేజ్లో 242 మండలాల్లో 5331 పంచాయతీలకు, 47,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది ఇలా ఉంటే గురువారం మధ్యాహ్నం హైకోర్టులో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై విచారణ జరుగనుంది. కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల సంఘం, ప్రభుత్వం ముందుకెళ్లబోతుంది. ఏం తీర్పు వస్తుందనేదనేది ఇటు రాజకీయ పార్టీలు, ఆటు ఆశవాహుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read: web series: అదిరిపోయే యాక్షన్ డ్రామా.. కూర్చున్న చోటు నుంచి కదలనివ్వదు..
