Viral Video: ఆధునిక ప్రపంచంలో మోసాలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీని ఆసరాగా చేసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్ కాల్స్ చేసి ఆర్థిక మోసాలకు తెరతీస్తున్నారు. మీ పేరు లక్కీ డ్రాలో వచ్చిందని, కొంత డబ్బు చెల్లిస్తే ప్రైజ్ మనీ మీ ఖాతాలో జమ చేస్తామని సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తుంటారు. ఇది నమ్మి చాలా మంది మోసపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ మోసగాడి నుంచి వచ్చిన ఫేక్ కాల్ కు తనదైన రీతిలో యువతి బదులిచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (VC. Sajjanar) స్వయంగా ఈ వీడియోను పంచుకోవడం విశేషం.
వీడియో షేర్ చేసిన సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. క్యా ఐడియా అంటూ స్మైల్ ఎమోజీని క్యాప్షన్ గా పెట్టారు. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతకు చక్కటి ఉదాహరణ ఈ వీడియో అంటూ చెప్పుకొచ్చారు.
Kya Idea! 😀
ముల్లును ముల్లుతోనే తీయాలనే సామెతకు చక్కటి ఉదాహరణ ఇది.@Cyberdost @PMOIndia @HMOIndia pic.twitter.com/WY8IH7BCzI
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 5, 2025
వీడియోల ఏముందంటే?
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేసిన వీడియోలో ఓ యువతి.. సైబర్ క్రైమ్ కు పాల్పడే కేటుగాడితో మాట్లాడటాన్ని చూడవచ్చు. తొలుత యువతికి కాల్ చేసిన మోసగాడు.. ఆమె తండ్రి సూచన మేరకు రూ.2,500 పంపిస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమె ఫోన్ కు బ్యాంక్ నుంచి కాకుండా పర్సనల్ మెసేజ్ కింద రూ.25,000 క్రెడిట్ అయినట్లు ఫేక్ మెసేజ్ వస్తుంది. అయితే పొరపాటున ఒక జీరో ఎక్స్ ట్రా పడిందని కాబట్టి రూ.2,500 మినహాయించుకొని మిగిలిన డబ్బులు పంపాలని కేటుగాడు సూచిస్తాడు.
యువతి ఏం చేసిందంటే?
ఇక్కడే తెలివిగా వ్యవహరించిన యువతి.. ఇదిగో డబ్బు పంపిస్తున్నానంటూ కేటుగాడ్ని నమ్మించింది. తన మెుబైల్ కు ఏ విధంగా అయితే వ్యక్తిగత నెంబర్ నుంచి టెక్ట్స్ మెసేజ్ వచ్చిందో.. అదే విధంగా రూ.22,500 పంపిస్తున్నట్లుగా మెసేజ్ టైప్ చేసి అతడికి సెండ్ చేసింది. అప్పుడు కేటుగాడు.. అదేంటి టెక్స్ట్ మెసేజ్ పంపావ్? అని ప్రశ్నించగా.. నువ్వు చేసిందేంటి? అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టేసింది.
Also Read: Caste Census Survey: కులగణన క్రెడిట్ తిప్పలు.. బీజేపీ కొత్త స్కెచ్.. వర్కౌట్ అయ్యేనా!
నెటిజన్లు ప్రశంసలు
ఈ వీడియో వైరల్ కావడంతో సదరు యువతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సైబర్ నేరగాడ్ని భలే బోల్తా కొట్టించిందని అభినందిస్తున్నారు. ఈ తరహా కాల్స్ ఎవరికైనా వస్తే యువతి స్టైల్ లో సమాధానమివ్వాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.