UP Farmer: బతికున్నాడని నిరూపించుకోవడానికి 18 ఏళ్లు
Lal Bihari
Viral News, లేటెస్ట్ న్యూస్

UP Farmer: బతికున్నాడని నిరూపించుకోవడానికి 18 ఏళ్లు పట్టింది.. విజయం సాధించిన రైతు

UP Farmer: ప్రభుత్వ రికార్డుల్లో దోషాల కారణంగా కొందరు అభాగ్యులు నానాఅవస్థలు ఎదుర్కొంటుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ జిల్లాకు చెందిన లాల్ బిహారి అనే రైతు (UP Farmer) ఎవరికీ చెప్పుకోలేని బాధ అనుభవించారు. 1976 నుంచి 1994 వరకు ఏకంగా 18 ఏళ్లపాటు ఆయన బతికివున్నా గానీ, ప్రభుత్వం దృష్టిలో మృతి చెందిన వ్యక్తిగా కొనసాగాల్సి వచ్చింది. తాను చనిపోలేదని ఆధారాలతో సహా నిరూపించడానికి ఆయనకు ఏకంగా 18 ఏళ్ల సుధీర్ఘ సమయం పట్టింది.

లాల్ బిహారి చనిపోయినట్టుగా 1976 జులై 30న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రికార్డుల్లో వివరాలు నమోదయ్యాయి. అయితే, ఈ విషయం లాల్ బిహారీకి చాలాకాలం వరకు తెలియదు. అప్పట్లో చేనేత వస్త్ర వ్యాపారం పెట్టేందుకు ప్రయత్నించిన ఆయన, బ్యాంక్ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా అసలు విషయం ఆయనకు తెలిసింది. భూపత్రాలను పరిశీలించిన అధికారులు.. ఆ భూమి లాల్ బిహారి పేరు మీద లేదని, ఆయన పేరును రికార్డుల నుంచి తొలగించి, అంకుల్ (బంధువు) పేరు మీదకు భూమి హక్కులు మారినట్టుగా బ్యాంక్ అధికారులు వివరించారు. అంటే, రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో తాను మృతుడిననే విషయాన్ని లాల్ బిహారి అప్పుడు గుర్తించాడు. దీంతో, తాను బ్రతికే ఉన్నట్టుగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది.

అంకుల్ మోసం చేయడమే కారణం
లాల్ బిహారి బతికి ఉన్నా మృతుడిగా రికార్డుల్లో చేరడానికి అధికారిక లోపాలు కారణం కాదు. ఆయన సమీప బంధువు పన్నిన కుట్ర అని తేలింది. లాల్ బిహారి చనిపోయాడంటూ అధికారులను నమ్మించి భూరికార్డుల్లో పేరుని తొలగించి, ఆ భూమి మొత్తాన్ని నిందిత బంధువు తన పేరిట రాయించుకున్నాడు. అక్రమంగా భూమి బదలాయింపు కోసం ఈ మార్గం ఎన్నుకున్నాడు. దీంతో, ఒక రాత్రిలోనే లాల్ బిహారి పేరు బతికివున్న వ్యక్తుల జాబితా నుంచి తొలగింపునకు గురైంది. దీంతో, లాల్ బిహారీ విచిత్రమైన పోరాటం మొదలుపెట్టాల్సి వచ్చింది. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఆయన వినూత్న, విచిత్ర మార్గాలు ఎంచుకుని పోరాడారు. రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ వంటి ప్రముఖ రాజకీయ నేతలపై ‘మృత’ అభ్యర్థిగా పోటీ చేసి వార్తల్లో నిలిచారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.

Read Also- Virender Sehwag: ఆ ముగ్గురు గేమ్ ఛేంజర్లు.. టీమిండియాపై సెహ్వాగ్ తొలి స్పందన

విచిత్ర సందర్భం..
లాల్ బిహారి ఒకసారి తన సోదరుడి కొడుకుని కిడ్నాప్ చేశారు. అలాగైనా పోలీసు రికార్డుల్లో తన పేరు ఎక్కుతుందేమోనని ఆశించారు. కానీ, మృతి చెందిన వ్యక్తిపై కేసు ఎలా నమోదు చెయ్యాల్లో పోలీసులకు అస్సలు అర్థం కాలేదు. ఉద్యోగ వ్యవస్థపై వ్యంగ్యంగా.. తన భార్యకు వితంతువు పెన్షన్‌‌కు దరఖాస్తు చేశారు. అంతేకాదు, 1989లో ఒకసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోకి చొరబడి ‘నన్ను బ్రతికించండి!’ అంటూ నినాదాలు చేశారు. ఆ ఘటన తర్వాత విషయం నాడు సీఎంగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ (అప్పటి యూపీ సీఎం) దృష్టికి వెళ్లింది. ఎట్టకేలకు 1994 జూన్ 30న రెవెన్యూ రికార్డుల్లో ఆయనను తిరిగి బతికివున్న వ్యక్తిగా గుర్తించారు. దీంతో, ఆయన పోరాటం ఫలించింది. అయినప్పటికీ లాల్ బిహారి తన పోరాటాన్ని అక్కడితో నిలిపివేయలేదు. 18 ఏళ్లపాటు మృతుడిగా గుర్తించినందుకు తన రూ.25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ 2018లో అలహాబాద్ హైకోర్టు‌లో పిటిషన్ వేశారు. ఇదీ, లాల్ బిహారికి ఎదురైన విచిత్ర పరిస్థితి. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయన 2024 జనవరిలో తన భార్య కర్మీ దేవిని మళ్లీ వివాహం చేసుకున్నారు.

Read Also- Singer Suchitra: ఈ వయసులో గాయనికి కాబోయే భర్త ఏం చేశాడంటే?.. మరీ అంత దారుణమా!

మృతుల సంఘంలో భారీగా సభ్యులు

బతికివున్నా చనిపోయినట్టుగా ప్రభుత్వ రికార్డుల్లో పేర్కొనడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఉన్నారు. పేద రైతులు, గ్రామీణ ప్రాంతవాసులు, భూమి వ్యవహారాల్లో లంచాల కారణంగా బతికివున్న మృతులుగా మారుతున్నారు. ఈ సత్యాన్ని గ్రహించిన లాల్ బిహారి, 1980లలో ‘మృతుల సంఘం’ (Association of the Living Dead) అనే సంస్థను స్థాపించారు. ఈ సంఘంలో ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటివరకు 21,000కు పైగామంది సభ్యులు చేరారు. దేశవ్యాప్తంగా ఇంకొన్ని వేలమంది ఉండొచ్చని అంచనాగా ఉంది.

Just In

01

Local Body Elections: తెలంగాణ పల్లెల్లో మొదలైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్..!

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?