Actor Madhavan: ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ కు ఊహించిన షాక్ ఎదురైంది. లద్దాఖ్ (Ladakh)పర్యటనలో ఉన్న ఆయన.. భారీ వర్షాలు ప్రతీకూల వాతావరణం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. లేహ్ నగరంలోని ఓ హోటల్లో ఉండిపోయారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మాధవన్.. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఎడతేరిపి లేని వర్షాల కారణంగా లద్దాఖ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలను అధికారులు రద్దు చేశారు. దీంతో తిరిగి తన ఇంటికి చేరుకోలేని పరిస్థితి మాధవన్ కు ఎదురైంది. ప్రస్తుతానికి బస చేస్తున్న హోటల్లోనే సేఫ్ గా ఉన్నట్లు మాధవన్ తెలిపారు.
2008లోనూ సరిగ్గా అక్కడే..
నటుడు మాధవన్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. 17 ఏళ్ల క్రితం 3 ఇడియట్స్ సినిమా షూటింగ్ కోసం వచ్చినప్పుడు కూడా లేహ్ ప్రాంతంలో ఇరుక్కుపోయినట్లు తెలిపారు. 2008లో 3 ఇడియట్స్ షూట్ కోసం లద్దాఖ్ వెళ్లినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు.
లేహ్ వాతావరణంపై..
మాధవన్ తాజాగా షేర్ చేసిన పోస్ట్ లో తను ఉంటున్న హోటల్ గది కిటికీ నుంచి పర్వత శిఖరాలను చూపించారు. మంచుతో కప్పబడిన పర్వాతాలతో పాటు మేఘావృతమైన ఆకాశాన్ని చూపించారు. ‘ఆగస్టు చివరలోనే లద్దాఖ్ పర్వతాలపై మంచు కురవడం ప్రారంభమైంది. నిరంతర వర్షాల కారణంగా గత 4 రోజులుగా విమానాశ్రయం మూసివేయబడింది. అందుకే లేహ్‌లోనే చిక్కుకుపోయాను. నేను ప్రతిసారి లద్దాఖ్ కు షూట్ కోసం రాగానే ఇదే జరుగుతోంది’ అని మాధవన్ చెప్పుకొచ్చారు.
2008లో ఎదురైన అనుభవం
‘3 ఇడియట్స్’ షూటింగ్ సందర్భంగా ఎదురైన అనుభవం గురించి కూడా మాధవన్ తన సోషల్ మీడియా పోస్ట్ లో మాట్లాడారు. ‘2008లో చివరిసారిగా నేను 3 ఇడియట్స్ షూట్ కోసం ప్యాంగాంగ్ సరస్సు వద్దకు వచ్చాను. అప్పుడు కూడా ఆగస్టులో అకస్మాత్తుగా మంచు పడి మేము వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది. అయినా ఇక్కడి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు ఆకాశం తేలికగా మారి విమానాలు ల్యాండ్ అవుతాయని నేను ఇంటికి తిరిగి వెళ్తానని ఆశిస్తున్నాను’ అని మాధవన్ ఆకాంక్షించారు.
లేహ్ వాతావరణం
భారీ వర్షాలు, మంచు కారణంగా లేహ్ లో ప్రతీకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బుధవారం లేహ్ విమానాశ్రయ రన్‌వే ను అధికారులు మూసివేశారు. దీనివల్ల విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయం కూడా ప్రయాణికులకు సలహా జారీ చేసింది. వాతావరణం సాధారణ స్థితికి రాగానే విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Ganesh Chaturthi: మానుకోట ఖమ్మం జిల్లాలో ఘనంగా గణనాథుల ఉత్సవాలు!
మాధవన్ ఫిల్మ్ కెరీర్..
నటుడు మాధవన్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘ఆప్ జైసా కోయి’లో నటించారు. ఇందులో బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి వివేక్ సోనీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం మాధవన్ ‘దురంధర్’ చిత్రంలో కనిపించనున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇందులో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపల్ కూడా నటిస్తున్నారు.
