Congress MLA: ఇప్పటికే ఓ నటిని వేధించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళలోని పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మంకూటతిల్‌పై (Congress MLA) మరింత సంచలనమైన ఆరోపణ వచ్చింది. ఎమ్మెల్యే రాహుల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్త అవంతిక విష్ణు ఆరోపించారు. తనపై అత్యాచారం రీతిలో కోరిక (ఫాంటసీ) తీర్చుకుంటానంటూ అడిగాడని, శారీరకంగా తనకు లొంగిపోవాలంటూ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెట్టడానికి తొలుత తాను వెనుకడుగు వేశానని, రాజకీయంగా రాహుల్ ఉన్న స్థాయిని దృష్టిలో పెట్టుకున్నానని ఆమె వివరించారు.
విషయాన్ని కాంగ్రెస్ నేతల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అవంతిక నైరాశ్యం వ్యక్తం చేశారు. దీంతో, ముందుకు రాకుండా తాను ఆగిపోయానని, అయితే, మలయాళ నటి రిని జార్జ్‌తో పాటు ఇతర మహిళలు కూడా ఎమ్మెల్యే రాహుల్‌పై ఆరోపణలు చేయడంతో తన విషయంలో జరిగిన దానిని కూడా బయటకు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు అవంతిక తెలిపారు.
Read Also- Bharatiya Antariksh Station: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ నమూనా విడుదల
త్రిక్కాకర ఉప ఎన్నికల తర్వాత ఫేస్‌బుక్ ద్వారా తనకు ‘హాయ్’ చెప్పిన రాహుల్ తొలుత మామూలుగానే చాటింగ్ ప్రారంభించాడని అవంతికి చెప్పారు. ఆ తర్వాత టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసి, శారీరక సంబంధం కోరారని వివరించారు. బెంగళూరు, హైదరాబాద్‌లో కలవాలని కోరాడని, అత్యాచార ఫాంటసీని తపై తీర్చుకోవాలనుకున్నారని ఆమె ఆరోపించారు.
మూడేళ్లుగా ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనే ప్రశ్నపై స్పందిస్తూ, విషయాన్ని అప్పటికే కొంతమంది స్నేహితులతో చెప్పానని, కానీ, కేరళలో బాగా పాపులర్ అయిన ఎమ్మెల్యే కావడంతో తాను బయటకు రాలేదని అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చానని, అయినప్పటికీ సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతున్నాయని అవంతిక విచారం వ్యక్తం చేశారు. మరొకరికి కూడా తనలాగే జరిగిందని తెలుసుకొని ఇప్పుడు బయటకొచ్చానని ఆమె పేర్కొన్నారు. ఆయన తన అధికారాన్ని వాడుకుని సాక్ష్యాలను ధ్వంసం చేస్తాడని భావించానని, చివరికి తాను ఒక్కదాన్నే మిగిలిపోతానని ఆందోళన చెందినట్టు వివరించారు. ఆయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కాబట్టి న్యాయం జరగదని భావించినట్టు వివరించారు.
Read Also- Sanju Samson’s Wife: ఆసియా కప్‌కు ముందు సంజూ శాంసన్‌పై భార్య చారులత కీలక అప్‌డేట్!
కాగా, రిని జార్జ్ అనే మలయాళ నటి కూడా ఎమ్మెల్యే రాహుల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఆయన కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు.