Bharatiya Antariksh Station: అంతరిక్ష రంగంలో చిరస్మరణీయ విజయాలు సాధిస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోంది. 2028 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని కలలు కంటోంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా కృషి చేస్తున్నారు. అయితే, భారతీయ అంతరిక్ష స్టేషన్‌కు (Bharatiya Antariksh Station) సంబంధించిన నమూనాను ఇస్రో తొలిసారి శుక్రవారం విడుదల చేసింది. జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘మాడ్యూల్ నమూనా’ను వెల్లడించింది. 2028లో మొదటి మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారతీయ అంతరిక్ష్ స్టేషన్ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇప్పటివరకు ఒక్క చైనాకు మాత్రమే సొంతం స్పేస్ స్టేషన్ ఉంది.
ప్రస్తుతం ప్రపంచంలో రెండే అంతరిక్ష స్టేషన్లు ఉండగా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను (ISS) నాసాతో పాటు ఐదు స్పేస్ ఏజెన్సీలు ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. ఇక, చైనాకు సొంతంగా టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఉంది. ఈ జాబితాలో చేరేందుకు భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది.
కాగా, 2035 నాటికి మొత్తం ఐదు మాడ్యూళ్లతో భారతీయ అంతరిక్ష స్టేషన్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మన దేశం ముందుకెళుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టులో భాగంగా తొలి మాడ్యూల్ అయిన బీఏఎస్-01ను (BAS-01) భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లోయర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. బీఏఎస్-01 బరువు సుమారు 10 టన్నులు ఉంటుంది. దీని పరిమాణం 3.8 మీటర్లు x 8 మీటర్లుగా ఉంటుంది.
ప్రత్యేకతలు ఇవే
భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, దీనికి అవసరమైన ముఖ్యమైన వ్యవస్థలను స్వదేశీ సాంకేతికతలతో తయారు చేశారు. దేశీయంగా అభివృద్ధి పరిచిన ఈసీఎల్ఎస్ఎస్ (Environmental Control and Life Support System), భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్, శాస్త్రీయ చిత్రీకరణ, అంతరిక్ష సిబ్బంది విశ్రాంతి కోసం వ్యూపోర్ట్స్ ఉన్నాయి. అంతేకాదు, ప్రొపల్షన్, ఈసీఎల్ఎస్ఎస్ ద్రవాలను తిరిగి నింపే వెసులుబాటు, రేడియేషన్, వేడి (థర్మల్), మైక్రోమీటియోరైడ్ (MMOD) నుంచి రక్షణ, స్పేస్ సూట్లు, స్పేస్ వాక్స్‌కు అవసరమైన ఎయిర్‌లాక్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంటిగ్రేటెడ్ అవియానిక్స్, వెంటనే పనిచేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇలా అధునాతన సదుపాయాలు భారతీయ అంతరిక్ష స్టేషన్‌లో ఉంటాయి.
Read Also- Viral News: పేమెంట్ ఫెయిల్ కావడంతో భార్యకు తెలిసిపోయిన భర్త సీక్రెట్ శారీరక సంబంధం
ఈసీఎల్ఎస్ఎస్ వ్యవస్థ అంతరిక్షంలో జీవించడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక, భారత్ డాకింగ్ సిస్టమ్, భారత్ బెర్తింగ్ మెకానిజం అంతరిక్షయానంలో స్పేస్ స్టేషన్‌తో కలిపేందుకు ఉపయోగపడతాయి. ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టమ్ ద్వారా తలుపులు ఆటోమేటిక్‌గా వాటంతట అవే తెరుచుకుంటాయి. ఇక, వ్యూవ్‌పోర్ట్స్ పరిశోధనల కోసం, వ్యోమగాముల రిలాక్సేషన్ కోసం ఉపయోగపడతాయి. వ్యూవ్‌పోర్ట్స్ అంతరిక్షాన్ని వీక్షించే కిటికీలుగా ఉపయోగపడతాయి.
ఇంతకీ ఉపయోగాలు ఏమిటి?
భారతీయ అంతరిక్ష స్టేషన్‌తో విస్తృతమైన ఉపయోగాలు ఉంటాయి. వైద్యం, జీవశాస్త్రం, గ్రహాంతర పరిశోధనల కోసం ప్రయోగాలు చేపట్టడానికి ఈ స్టేషన్ ఉపయోగపడుతుంది. మైక్రోగ్రావిటీలో మనుషుల ఆరోగ్యంపై ఉండే ప్రభావాలపై అధ్యయనం చేయనున్నారు. దీర్ఘకాలంపాటు మనిషి అంతరిక్షంలో జీవించడానికి అవసరమైన టెక్నాలజీలను కూడా పరీక్షించవచ్చు. అంతేకాదు, స్పేస్ టూరిజానికి కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎంతగానో ఉపయోగపడనుంది. వాణిజ్య పరంగా ఇదో సరికొత్త అధ్యయనంగా నిలవనుంది. ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులకు కూడా సహకారం అందించనుంది. దేశ యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
Read Also- Sanju Samson’s Wife: ఆసియా కప్‌కు ముందు సంజూ శాంసన్‌పై భార్య చారులత కీలక అప్‌డేట్!