Period Delay: పండుగలు, పెళ్లిళ్లు, ప్రయాణాలు లేదా మతపరమైన ఆచారాల కోసం చాలా మంది మహిళలు తమ పీరియడ్స్‌ను వాయిదా వేసేందుకు ఇంగ్లిష్ మెడిసిన్స్ ను వాడుతుంటారు. అయితే, ఈ మాత్రల వాడకం ఎంత ప్రమాదకరమో ఒక విషాదకర సంఘటన ఇటీవల మరోసారి రుజువు చేసింది. భారత వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వివేకానంద్ ఒక హృదయవిదారక ఘటనను వెల్లడించారు. ఒక 18 ఏళ్ల యువతి మతపరమైన కార్యక్రమం కోసం పీరియడ్స్‌ను వాయిదా వేయడానికి మూడు రోజుల పాటు హార్మోన్ మాత్రలు వాడింది. కొన్ని రోజుల్లోనే ఆమెకు కాళ్లలో నొప్పి, వాపు మొదలైంది. ఆస్పత్రిలో పరీక్షించగా, ఆమెకు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనే ప్రాణాంతక రక్త గడ్డ కట్టే వ్యాధి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. రక్తం గడ్డ కట్టిన భాగం నాభి వరకు వ్యాపించడంతో పరిస్థితి తీవ్రమైంది.
ఓ డాక్టర్ తన నిజ జీవితంలో జరిగిన ” రీబూటింగ్ ది బ్రెయిన్ ” పాడ్‌కాస్ట్‌లో ఈ సంఘటనను పంచుకుంటూ ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్నారు. “నేను ఆ అమ్మాయి తండ్రిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించమని సూచించాను. కానీ వారు ఉదయం వరకు ఆగారు. రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది. ఆమెను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చినప్పటికీ, అప్పటికే ఆమె శ్వాస ఆగిపోయింది. ఆ క్షణం నాకు ఎనలేని బాధ కలిగించింది,” అని ఆయన వ్యక్తం చేశారు.
హార్మోన్ మాత్రలలో దాగిన ప్రమాదం చాలా మంది మహిళలకు తెలియదు. చెప్పినా కూడా అర్ధం చేసుకోరు. పండుగలు, పరీక్షలు, ప్రయాణాలు లేదా వివాహాల కోసం వైద్య సలహా లేకుండా ఈ మెడిసిన్స్ ను నిర్లక్ష్యంగా వాడుతుంటారు. కానీ, ఈ మాత్రలలో అధిక మోతాదులో ఉండే హార్మోన్లు రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల, ఇటువంటి మాత్రలను వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరి, వాటిని అత్యవసర సందర్భాల్లో మాత్రమే, సరైన మోతాదులో వాడాలి.
Also Read: Allu Kanakaratnamma: ముగిసిన అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన చిరు, మనవళ్లు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.