Team India: లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా (Team India) అనూహ్యరీతిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో బాగానే రాణించినప్పటికీ, వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమయ్యారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ పేస్ త్రయం, ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ఆశించిన స్థాయిలో వికెట్లు సాధించలేకపోయారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్న బుమ్రా కూడా రెండవ ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ ప్రభావం టీమ్ ఫలితాన్ని ప్రభావితం చేసిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
కాగా, తొలి మ్యాచ్‌లో ఓటమి భారంతో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. జులై 2 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌కు పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమవనున్నాడని సమాచారం. బుమ్రాపై భారం, అలసటను తగ్గించేందుకు రెండో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్టు భారత క్రికెట్ జట్టు వర్గాలు చెబుతున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందే, ఇంగ్లాండ్‌తో జరిగే 5 టెస్టు మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే బుమ్రా ఆడాలని నిర్ణయించారు. ముందుగా నిర్ణయించినట్టుగానే బర్మింగ్‌హామ్ టెస్టు మ్యాచ్‌లో అతడు ఆడబోడని తెలుస్తోంది. జులై 10 నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Read this- Shubhanshu Shukla: శుభాంశు చరిత్ర.. అంతరిక్ష కేంద్రంలో అడుగు
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లు తీశాడు. రెండో టెస్ట్ మ్యాచ్‌లో అతడు అందుబాటులో లేకపోతే జట్టుపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. పెద్ద ఎదురుదెబ్బగా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఇక, మహ్మద్ సిరాజ్ కూడా ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు వేసి 3 వికెట్లు మాత్రమే తీసి, ఏకంగా128 పరుగులు సమర్పించుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు సంధించి 2 వికెట్లు 92 రన్స్ ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసి122 పరుగులు ఇచ్చాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు వేసి కనీసం ఒక్క కూడా తీయలేకపోయాడు. పైగా 51 పరుగులు సమర్పించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా గణాంకాలు అందరికంటే మెరుగ్గా ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 43.4 ఓవర్లు వేసి 3.20 ఎకానమీ రేటుతో 5 వికెట్లు తీసి 140 పరుగులు ఇచ్చారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించాడు.
Read this- Shubhanshu Shukla: శుభాంశు శుక్లా ఏం చదివారు?, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసా?
బుమ్రా స్థానంలో ఎవరు?
రెండవ టెస్ట్ మ్యాచ్‌కు జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. యువ పేసర్లు ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ ఈ ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లతో పాటు మీడియం పేస్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. అయితే, బుమ్రా స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్ష్‌దీప్ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే, వన్డే, టీ20లలో రాణించిన అనుభవం ఉంది. ఇప్పటివరకు 63 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అర్షదీప్ సింగ్ 99 వికెట్లు పడగొట్టారు. భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, టీమ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండాలని భావిస్తే శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.