Sunjay Family: ప్రముఖ పారిశ్రామికవేత్త, సోనా గ్రూప్ అధినేత సంజయ్ కపూర్ గత నెలలో పోలో ఆడుతూ అకస్మాతుగా గుండెపోటు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత సోనా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యంపై పట్టు సాధించడమే లక్ష్యంగా కుటుంబంలో తీవ్ర కలహాలు చెలరేగాయి. సుమారుగా రూ.30,000 కోట్ల వ్యాల్యూ ఉన్న గ్లోబల్ కంపెనీ ‘సోనా కామ్‌స్టార్’ (Sona BLW Precision Forgings) ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. సంజయ్ తల్లి రాణి కపూర్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. కొడుకు చనిపోయిన బాధలో తాను ఉంటే కొందరు వ్యక్తులు తనతో కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని, సోనా కంపెనీ వార్షిక సాధారణ సమావేశాన్ని (AGM) ఆపివేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు. కంపెనీలో తమ కుటుంబ ప్రతినిధిగా ఉన్న ఏకైక వ్యక్తిని తానేనని ఆమె పేర్కొన్నారు. ఆమె బహిరంగంగా ఎవరి పేరు ఎత్తకపోయినప్పటికీ కోడలైన సంజయ్ కపూర్ భార్య ప్రియా సచ్దేవ్ కపూర్‌ను ఉద్దేశించి అంటున్నట్టుగా స్పష్టమవుతోంది. కొంతమందిని కంపెనీ డైరెక్టర్లుగా నియమించేందుకు చేసిన తీర్మానంపై తనకు సమాచారం ఇవ్వలేదని, బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని, దీనిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాణి కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాత వీలునామా చూపిస్తున్న తల్లి
ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మృతి తర్వాత ఆయన కుటుంబంలో కేవలం ఒక నెలలో అనూహ్య మార్పులు చేసుకున్నాయి. ఆయన తల్లి రాణి కపూర్ శుక్రవారం విడుదల చేసిన లేఖలో కంపెనీపై తనకు మాత్రమే హక్కు ఉందని అన్నారు. పదేళ్లక్రితం రాసిన ఓ వీలునామాను చూపించారు. 2015లో రాసిన వీలునామా ఆధారంగా కంపెనీపై అధికారం తనదేనని ఆమె అన్నారు. 2015 జూన్ 30న వీలునామా రాశామని, తన భర్త సురీందర్ కపూర్, తనకు ఆస్తుల మొత్తంపై వారసత్వం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. దీనిని బట్టి, వాహనరంగ కంపెనీ అయినా ‘సోనా కామ్‌స్టార్’లోని వాటాతో పాటు మొత్తం సోనా గ్రూప్‌కు తానే వారసురాలిని అని, తనకే అధికారం ఉంటుందని చెబుతున్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రియ
రాణి కపూర్ డిమాండ్ చేసినప్పటికీ కంపెనీ వార్షిక సమావేశం ఆగలేదు. ఇప్పటికే కంపెనీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ప్రియను, 2025 జూలై 25న జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. రాణి కపూర్ 2019 తర్వాత నుంచి షేర్‌హోల్డర్ కాదని కంపెనీ తరపున ప్రకటించారు. అయితే, మోడల్, నటి, కార్పొరేట్ లీడర్‌గా గుర్తింపు పొందిన ప్రియ సచ్దేవ్ కపూర్ ఈ వివాదంపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం.
Read Also- Sunjay Kapur: బిజినెస్‌మాన్ మృతి.. అత్తను గదిలో బంధించిన కోడలు!
కంపెనీ స్టేటస్‌ను ఒకసారి పరిశీలిస్తే, 2021 జూన్‌లో సోనా కామ్‌స్టార్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ప్రస్తుతం 71.98 శాతం షేర్లు పబ్లిక్ షేర్‌హోల్డర్లు వద్ద ఉండగా, 28.02 శాతం షేర్లు సంస్థ ప్రమోటర్ అయిన ఔరియస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ (AIPL) వద్ద ఉన్నాయి. రాణి కపూర్ 2019 నుంచి షేర్‌హోల్డర్ కాదని కంపెనీ రికార్డులు చెబుతున్నాయి. 2019లో కంపెనీ ఒక డిక్లరేషన్ చేయగా, దాని ప్రకారం ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్‌కి అంతిమ లబ్ధిదారుగా (beneficial owner) సుంజయ్ కపూర్ ఉన్నట్టు అందులో కంపెనీ తెలిపింది.
కాగా, దివంగత సంజయ్ కపూర్‌కు ప్రియ సచ్దేవ్ కపూర్ మూడవ భార్య. ఆమె కంటే ముందు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. అంతకంటే ముందు ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీని 1996లో వివాహం చేసుకున్నారు. 2000లో విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్‌తో ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్, మూడవ భార్య ప్రియతో ఒక కొడుకు అజరియాస్… సంజయ్ కపూర్‌కు సంతానంగా ఉన్నారు. ఇక, ఆయనకు మండీరా కపూర్ స్మిత్, సుపర్నా కపూర్ మోత్వానె అనే అక్కలు ఉన్నారు.
Read Also- PM Modi: ప్రధాని మోదీపై తాజా ప్రజాభిప్రాయం ఇదే