Sunjay Kapur: సుమారుగా రూ.30,000 కోట్ల మార్కెట్ విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యాపారవేత్త, సోనా గ్రూప్ అధినేత సుంజయ్ కపూర్ (Sunjay Kapur) గత నెల జూన్‌లో అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. దీంతో, ఆయన కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయం, టెక్స్‌టైల్స్, కన్‌స్ట్రక్షన్, ఐటీ, ఎడ్యుకేషన్, బయోటెక్ రంగాల్లో విస్తరించిన ఈ కంపెనీపై, ఆస్తులపై నియంత్రణ కోసం కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైంది. ఈ మేరకు సుంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ శుక్రవారం సంచలన ఆరోపణలు చేశారు. తాళం వేసిన గదిలో ఉంచి, బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని అన్నారు. ఈ చర్యల వెనక తన కోడలు ప్రియా సచ్దేవ్ కపూర్ ఉన్నట్టుగా ఆమె మాటలు స్పష్టంగా అర్థమయ్యేలా ఉన్నాయి. తన కొడుకు మరణానంతరం సోనా గ్రూప్ వారసత్వాన్ని హస్తగతం చేసుకునే కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరిని కాపలాగా కూడా పెట్టారని ఆమె విచారం వ్యక్తం చేశారు. గ్రూపునకు చెందిన వ్యవసాయ విభాగ కంపెనీ సోనా కామ్‌స్టార్ వార్షిక సమావేశానికి కొన్ని గంటల ముందు రాణి కపూర్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు సంచలనంగా మారాయి. కాగా, సుంజయ్ కపూర్ జూన్‌లో చనిపోయేంత వరకు సోనా గ్రూప్ చైర్మన్‌గా కొనసాగారు.
భావోద్వేగ లేఖ
సోనా కామ్‌స్టార్ బోర్డుకు రాణి కపూర్ ఒక భావోద్వేగపూరితమైన లేఖ కూడా రాశారు. సోనా గ్రూప్‌లో ప్రధాన వాటాదారుని తానేనని, తన కుమారుడి మరణంతో బాధలో ఉన్న సమయంలో వివరణ లేకుండా కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కంపెనీపై పాక్షిక నియంత్రణ సాధించాలని చూస్తున్న వ్యక్తులు (కోడలు ప్రియా సచ్దేవ్ కపూర్ అనే ఉద్దేశ్యంతో) తమను అతిపెద్ద వాటాదారులుగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకోసం తనపై ఒత్తిడి చేసి సంతకం పెట్టించుకున్న డాక్యుమెంట్లను ఆధారంగా చూపుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఇబ్బందికరమైన ఈ పరిస్థితుల మధ్య సోనా కామ్‌స్టార్ వార్షిక సమావేశాన్ని రెండు వారాలపాటు వాయిదా వేయాలంటూ లేఖలో ఆమె డిమాండ్ చేశారు. తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్న సమయంలో తాళం వేసిన గదిలో తనతో డాక్యుమెంట్లపై సంతకం చేయించుకున్నారని, వాటిలో ఏముందని అడిగినా ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదని రాణి కపూర్ పేర్కొన్నారు.
Read Also- Rupee Fall: ఆగని రూపాయి పతనం.. శుక్రవారం ఏకంగా..
బ్యాంక్ అకౌంట్లు వాడుకోనివ్వడం లేదు
కొడుకు చనిపోయిన శోకంలో తాను ఉంటే కొందరు వ్యక్తులు తన కుటుంబ వారసత్వాన్ని ఉన్నపలంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన బ్యాంక్ అకౌంట్లను కూడా వాడుకోనివ్వడం లేదని, సంపూర్ణంగా తనను నిషేధించారని రాణి కపూర్ చెప్పారు. తాను స్వేచ్ఛగా జీవించకుండా కొందరు వ్యక్తులను కాపలాగా కూడా పెట్టారని, ఇవన్నీ కొడుకు సుంజయ్ కపూర్ చనిపోయిన నెల రోజుల్లోపే జరిగాయని ఆమె వాపోయారు. సోనా కామ్‌స్టార్ వార్షిక సమావేశంలో కపూర్ కుటుంబ ప్రతినిధిగా డైరెక్టర్ నియామకానికి సంబంధించిన తీర్మానం ఉన్నట్టు తనకు సమాచారం వచ్చిందని, అయితే ఈ నిర్ణయాన్ని తీసుకునే ముందు తనతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె అన్నారు. ‘‘నా కొడుకు చనిపోయాక నేను ఎవరినీ బోర్డ్ సభ్యుడిగా నామినేట్ చేయలేదు. నా తరఫున సోనా గ్రూప్‌లో ఎవరు ప్రతినిధిగా వ్యవహరించడానికీ నేను అనుమతించలేదు. ఈ వ్యవహారంలో చాలా అక్రమాలు జరిగాయి’’ అని రాణి కపూర్ పేర్కొన్నారు.
తన అనుమతి లేకుండా తీసుకున్న ఏ నిర్ణయమైనా పూర్తిగా అనుచితమని ఆమె స్పష్టం చేశారు. రాణి కపూర్ ఇంత సంచలన లేఖ విడుదల చేసినప్పటికీ సోనా కామ్‌స్టార్ బోర్డు ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో, కంపెనీ వార్షిక సమావేశం వాయిదా పపడుతుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.
Read Also- Sad News: ఘోరవిషాదం.. స్కూల్లో ఏడుగురు విద్యార్థుల మృతి