US Plane Crash: అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక్కసారిగా మినీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై సరిగ్గా విమానం ల్యాండ్ కావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఘటన అనంతరం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదంలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లో వెళ్తే..
ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రేవార్డ్ కౌంటీలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఒర్లాండో సమీపంలోని ఇంటర్ స్టేట్ – 95 రహదారిపై సింగిల్ ఇంజిన్ బీచ్ క్రాఫ్ట్ – 55 విమానం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న టొయోటా క్యామ్రీ కారుపై కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 57 ఏళ్ల మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ లోని ఇద్దరు వ్యక్తులు సైతం సేఫ్ గా బయటపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం అనంతరం విమాన అవశేషాలు రహదారి మెుత్తం ఎగిరిపడ్డాయి. దీంతో ఫ్లోరిడాలో అత్యంత రద్దీగా ఉన్న ఈ హైవేను అధికారులు కొద్దిసేపు మూసివేయాల్సి వచ్చింది.
WATCH: Small plane crashes into car while landing on I-95 in Brevard County, Florida pic.twitter.com/WpAFd2INs4
— BNO News Live (@BNODesk) December 9, 2025
భారీగా ట్రాఫిక్ జామ్
మరోవైపు విమానం కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? పైలెట్ తప్పిదమా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదానికి కొద్ది గంటల ముందే ఫ్లోరిడాలో మరో ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్.. డీలాండ్ హై స్కూల్ సమీపంలోని ప్లే మౌత్ అవెన్యూ – జాకబ్స్ రోడ్ కూడలిలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ అవశేషాలు రోడ్డుపై పడిపోవడంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read: Mowgli 2025: బాలయ్య దెబ్బకు ఒకరోజు వెనక్కి తగ్గిన రోషన్ కనకాల ‘మోగ్లీ’.. ప్రీమియర్ ఎప్పుడంటే?
గత నెల 14 మంది మృత్యువాత
కాగా, గత నెలలో కెంటకీలో జరిగిన భయంకరమైన యూపీఎస్ కార్గో విమాన ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో యూపీఎస్ సంస్థ ప్రయాణికుల భద్రత కంటే లాభాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న విమర్శలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి. సదరు కంపెనీ పాత విమానాలను మెయింటెనెన్స్ లేకుండానే నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

