RCB Win IPL 2025: ఈ సాలా కప్పు నమ్దే.. నినాదం ఎట్టకేలకు నిజమైంది. ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముద్దాడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
లక్ష్య ఛేదనలో తడబడ్డ పంజాబ్
191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తడబట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే సాధించారు. టార్గెట్‌ను కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీయగా, యష్ దయాల్, జాష్ హేజల్ ఉడ్, షెఫర్డ్ తలో వికెట్ సాధించారు.
Read Also- Virat Kohli Record: కోహ్లీ నా మజాకా.. వార్నర్ రికార్డు మటాష్
శశాంక్ ఒంటరి పోరాటం
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో శశాంక్ సింగ్ 61 పరుగులతో చివరిలో ఒంటరి పోరాటం చేసినప్పటికీ గెలిపించలేకపోయాడు. ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో ప్రత్యర్థి ఆర్సీబీ శిబిరంలో ఆందోళనలు రేకెత్తించాడు. శశాంక్ సింగ్ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ఇక, మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే, జాష్ ఇంగ్లిస్ 39 పరుగులతో సెకండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్యా 24 పరుగులు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 26, శ్రేయాస్ అయ్యర్ 1, నెహల్ వధేర 15, మార్కస్ స్టోయినిస్ 6, ఒమర్జాయ్ 1, కైల్ జెమీసన్ 0 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
190 పరుగులు చేసిన ఆర్సీబీ
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 సాధించింది. 43 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌లో 3 బౌండరీలు ఉన్నాయి. విరాట్ ఆరంభంలో వికెట్లు పడకుండా ఆచితూచి జాగ్రత్తగా రాణించాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయినప్పటికీ ఫర్వాలేదనిపించారు. ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు, విరాట్ కోహ్లీ 43, మయాంక్ అగర్వాల్ 24, రజత్ పటీదార్ 26, లియామ్ లివింగ్‌స్టోన్ 25, జితేష్ శర్మ 24 పరుగులు చొప్పున కీలకమైన రన్స్ రాబట్టారు. మిగతావారిలో రొమారియో షెఫర్డ్ 17, కృనాల్ పాండ్యా 4, భువనేశ్వర్ కుమార్ 1, యష్ దయాల్ 1 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. ఇక, పంజాబ్ కింగ్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. కైల్ జెమీసన్ అత్యధికంగా 3 వికెట్లు, అర్షదీప్ సింగ్, ఒమర్జాయ్, విజయ్ కుమార్ తలో రెండేసి వికెట్లు తీశారు.
విరాట్ కోహ్లీ భావోద్వేగం
ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడడంతో స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలో కళ్లు చెమర్చాడు. సహచర ఆటగాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. భార్య అనుష్క శర్మను కూడా భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు.
Read Also- IPL 2025 Final: ఐపీఎల్ కోసం పెళ్లి పక్కనెట్టేశాడు.. ఆ క్రికెటర్ నిజంగా గ్రేట్!