Viral Video: యూకే ఘోర ప్రమాదం జరిగింది. మాంచెస్టర్ లోని ఎక్లెస్ ప్రాంతంలో డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సుకు ఎదురుగా తక్కువ ఎత్తులో ఉన్న రైల్వే వంతెన వచ్చింది. డ్రైవర్ చూసుకోకుండా ముందుకు లాగించడంతో వంతెన ఢీకొని బస్సు పైకప్పు పూర్తిగా చీల్చుకు పోయింది. ఈ ఘటన సోమవారం (జులై 21) జరగ్గా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
15 మందికి గాయాలు
ఎక్లెస్ లోని బార్టన్ రోడ్ – ట్రాఫోర్డ్ రోడ్ జంక్షన్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ కావడంతో ప్రమాద సమయంలో బస్సు టాప్ ఫ్లోర్ లోనూ ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. అయితే ఈ ఘటనలో ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. బస్సు రూఫ్ శిథిలాలు పడి.. 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు ఘటనాస్థలిలోనే చికిత్స అందించి ఆస్పత్రికి తరలించినట్లు నార్త్ వెస్ట్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది. అయితే ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్పష్టం చేసింది.
ప్రత్యక్ష సాక్షులు
బస్సు ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో పెద్దగా అరుపులు విన్నట్లు ఓ సాక్షి తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు తాను, తన స్నేహితురాలితో రోడ్డుకు సమీపంలో ఉన్న ఫ్లాట్ లో ఉన్నట్లు స్టిమోన్ హండ్జ్ చెప్పుకొచ్చారు. వంతెనను బస్సు ఢీకొట్టిన వెంటనే బిగ్గరగా శబ్దం వచ్చిందని.. బస్సుపైన నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడిపోవడాన్ని తన స్నేహితురాలు చూసిందని స్టిమోన్ వివరించారు.
Also Read: Most Abusive Language State: గలీజు మాటలపై దిక్కుమాలిన సర్వే.. ఆ రాష్ట్ర ప్రజలు నోరు తెరిస్తే బూతులేనట!
ఈ తరహా ఘటన మూడోసారి
స్థానిక నివాసి స్టేసీ మోర్లీ ప్రకారం.. ఈ వంతెన కారణంగా ప్రమాదం జరగడం ఇది మూడోసారి. గతంలో 2020 జూన్, 2023 డిసెంబర్‌లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇదిలా ఉంటే గ్రేటర్ మాంచెస్టర్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వెర్నాన్ ఎవరిట్ ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మరోవైపు బస్సు సాధారణంగా వెళ్లే మార్గంలో కాకుండా వంతెన ఉన్న రోడ్డులో రాంగ్ గా వచ్చిందని ట్రాన్స్‌పోర్ట్ ఫర్ గ్రేటర్ మాంచెస్టర్ (TfGM) తెలిపింది.
Bus roof ripped off after hitting a low bridge on Barton Lane, Eccles. The drivers a madman 👀#Eccles #Salford pic.twitter.com/4DIHsxZqpP
— Pundit Jay (@pundit_jay) July 22, 2025