Most Abusive Language State: మనుషుల్లో సర్వ సాధారణంగా కనిపించే ఎమోషన్ కోపం. అది వచ్చినప్పుడు మాటలపై చాలా మందికి నియంత్రణ ఉండదు. ఎదుటివారు ఏమనుకుంటారన్న ఆలోచన లేకుండా ఎడపెడా తిట్ల దండకం అందుకుంటారు. ఇది సహజంగా ప్రతీ మనిషి జీవితంలో ఏదోక సందర్భంలో ఎదురైన అనుభవమే. అయితే ఏ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా బూతులు మాట్లాడతారన్న దానిపై తాజాగా ఓ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన విషయాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. పురుషులు మాత్రమే అధికంగా బూతులు మాట్లాడుతుంటారని చాలా మంది అభిప్రాయం. కానీ ఈ సర్వేలో తాము ఏమి తక్కువేమి కాదని స్త్రీలు నిరూపించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి? బూతులు మాట్లాడటంలో ఏ రాష్ట్రం టాప్ లో ఉంది? ఈ కథనంలో పరిశీలిద్దాం.
11 ఏళ్లలో 70 వేల మందిపై సర్వే
సెల్ఫీ విత్ డాటర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ జగ్లాన్ (Sunil Jaglan) ఆధ్వర్యంలో బూతులు మాట్లాడే ప్రజలపై ఆసక్తికర సర్వే జరిగింది. సర్వేలో భాగంగా గత 11 ఏళ్లలో 70 వేల మందిని అధ్యయనం చేశారు. వీరిలో అన్ని వయస్సుల వారు, రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు, పోలీసులు, న్యాయవాదులు, కార్మికులు, శ్రామికులు ఉన్నారు. తాము ఏఏ సందర్భాల్లో బూతులు మాట్లాడాల్సి వస్తుంది? రోజుకు సగటున అనుచిత పదాలు ఎన్ని మాట్లాడతారు? అందుకు కారణమయ్యే అంశాలు ఏంటీ? తల్లి, సోదరి, కూతురును టార్గెట్ చేస్తూ పదాలు వాడతారా? వంటి వాటిపై ప్రశ్నలు వేశారు. ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలను సర్వేలో భాగం చేసి వారు ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఒక నివేదికను తయారు చేశారు.
దేశరాజధాని టాప్..
సర్వేలో వెలువడిన డేటా ప్రకారం.. బూతుల మాట్లాడే ప్రజలు దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యధిక శాతం మంది ఉన్నారు. ఢిల్లీలో 80శాతం మంది ప్రజలు.. దుర్భాషను ఉపయోగిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక ఇదే జాబితాలో పంజాబ్ (Panjab) రెండో స్థానంలో నిలిచింది. అక్కడి 78 శాతం ప్రజలు తరుచూ అనుచిత పదాలు ఉపయోగిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఉత్తర్ ప్రదేశ్ (74%), బిహార్ (74%), రాజస్థాన్ రాష్ట్రాలు లిస్ట్ లో 3, 4, 5 స్థానాల్లో నిలిచినట్లు సర్వే పేర్కొంది.
ఇతర రాష్ట్రాల గణాంకాలు
ప్రజలు అధికంగా బూతులు మాట్లాడే రాష్ట్రాల్లో రాజస్థాన్ (68%) ఆరో స్థానంలో నిలిచింది. ఇక హర్యానాలో 62 శాతం మంది, మహారాష్ట్రలో 58 శాతం మంది, గుజరాత్‌లో 55 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 48 శాతం మంది, ఉత్తరాఖండ్‌లో 45 శాతం మంది, కాశ్మీర్‌లో 15 శాతం మంది దుర్భాషను ఉపయోగిస్తునట్లు సర్వే పేర్కొంది. ఈశాన్య మరియు ఇతర రాష్ట్రాలలో 20-30 శాతం మంది బూతులు మాట్లాడుతున్నట్లు డేటా పేర్కొంది.
Also Read: Honeymoon Murder case: నెల రోజులుగా జైల్లోనే.. అయినా బుద్ధిరాలేదు.. తోటి ఖైదీలతో సోనమ్ ఏం చేసిందంటే?
బూతు.. వ్యాధి లాంటింది!
బూతు మాటలపై సర్వే చేయించిన డాక్టర్ సునీల్ జగ్లాన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్భాషలాడటం సంస్కారం కాదని.. అదొక వ్యాధి అని అన్నారు. ‘ఒక పిల్లవాడు ఎదుగుతున్న క్రమంలో చుట్టుపక్కల వారు మాట్లాడే భాష అతడి మనస్సులో పాతుకుపోతుంది. తర్వాత అది అలవాటుగా మారిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుత రోజుల్లో మహిళలు సైతం గణనీయంగా బూతులు మాట్లాడుతున్నట్లు లేటెస్ట్ సర్వే పేర్కొంది. 30 శాతం మంది మహిళలు, బాలికలు.. దుర్భాషలాడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.