Honeymoon Murder case: మేఘాలయాలో చోటుచేసుకున్న హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రియుడు రాజ్ కుష్వాహా (Raj Kushwaha)తో కలిసి భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi)ని సోనమ్ దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనలో సోనమ్, ఆమె ప్రియుడుతో పాటు మరో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లను గతంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కొంతకాలంగా ఆమె జైలు జీవితం గడుపుతోంది. షిల్లాంగ్ జైలులో అడుగుపెట్టి తాజాగా నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సోనమ్ గురించి.. జైలు వర్గాలు షాకింగ్ విషయాలను బయటపెట్టాయి.
జైలుకు అలవాటు పడ్డ సోనమ్..
సోనమ్ నెల రోజుల శిక్షా కాలానికి సంబంధించిన విషయాలను.. జైలు వర్గాలు ఓ జాతీయ మీడియాతో పంచుకున్నాయి. దాని ప్రకారం.. సోనమ్ గత నెల రోజుల్లో ఒక్కసారి కూడా కుటుంబ సభ్యులను కలవలేదు. 24 ఏళ్ల సోనమ్.. జైలు జీవితానికి అలవాటు పడ్డారని.. తోటి ఖైదీలతో కలిసిపోయినట్లు జైలు వర్గాలు చెప్పాయి. జైలులోని రూల్స్ కు అలవాటు పడ్డారని.. నిర్ధేశిత సమయానికి మేల్కొంటున్నారని పేర్కొన్నారు. తన భర్తను హత్య చేసిన విషయంపై ఆమె మౌనంగానే ఉంటున్నారని.. తోటి ఖైదీలు, జైలు అధికారులతో నేరం లేదా వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం లేదని వివరించారు.
త్వరలో కుట్టుపని అప్పగింత
‘జైలు వార్డెన్ కార్యాలయానికి దగ్గరే సోనమ్ ఉంటోంది. విచారణ ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఆమె గదిని షేర్ చేసుకుంటున్నారు’ అంటూ జైలు వర్గాలు స్పష్టం చేశాయి. సోనమ్ కు ఇంకా ఎలాంటి పని అప్పగించలేదని.. పునరావస కార్యక్రమంలో భాగంగా త్వరలో ఆమెకు కుట్టుపని, ఇతర నైపుణ్యాలను నేర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. జైలు లోపల ఆమెకు టెలివిజన్ కూడా ఉందని పేర్కొన్నారు. అయితే సోనమ్ ఆమె సోదరుడు గోవింద్ మధ్య జైలులో రహస్య సంభాషణ జరిగిందని మృతుడు రాజా రఘువంశీ కుటుంబం ఆరోపించిన నేపథ్యంలో జైలు వర్గాలు ఈ మేరకు తెలియజేశాయి. కాగా గోవింద్.. నిందితులకు టచ్ లో ఉంటూ.. తమకు మద్దతుగా ఉంటున్నట్లు నటిస్తున్నాడని రాజా సోదరుడు విపిన్ ఆరోపించారు.
రాజా ఫ్యామిలీ ఏమన్నదంటే?
మృతుడు రాజా రఘవంశీ సోదరుడు విపిన్ మాట్లాడుతూ.. సోనమ్ తమ్ముడు గోవింద్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ‘సోనమ్‌తో తమకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదని కుటుంబం చెప్పింది. కానీ అది అబద్ధమని తేలింది. సోనమ్ 4-5 సార్లు సోదరుడు గోవింద్ తో మాట్లాడింది. గత 4 వారాలుగా సోనమ్ – గోవింద్ మాట్లాడుకుంటున్నారని నేను నమ్ముతున్నా. వారు ఒక న్యాయవాదిని నియమించుకొని బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెుదట సోనమ్ రాజాను మోసం చేసింది. ఇప్పుడు ఆమె సోదరుడు మనందరినీ మోసం చేస్తున్నాడు’ అంటూ విపిన్ ఆరోపించారు.
Also Read: Artificial Sweeteners: చక్కెరకు బదులుగా వీటిని వాడుతున్నారా? అయితే మీ గుండె మటాషే!
అసలేం జరిగిందంటే?
హనీమూన్ కేసు విషయానికి వస్తే.. రాజా రఘువంశీ, సోనమ్ కు మధ్య మే 11న వివాహం జరిగింది. 20న వారు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కనిపించకుండా పోవడంతో అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి ఆమె గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు విచారణలో తేలడంతో ఆమెతో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.