Lords Test: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) అదరగొడుతున్నాడు. గత రెండు టెస్టుల మాదిరిగానే లార్డ్స్ వేదికగా (Lords Test) జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో కూడా అత్యంత కీలకమైన ప్రదర్శన చేశాడు. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోర్ 19 వద్ద బ్యాటింగ్ క్రీజులో అడుగుపెట్టిన పంత్ మూడవ రోజు ఆటలో కీలకమైన మరో 53 పరుగులు జోడించి 74 పరుగుల వద్ద ఔటయ్యాడు. దురదృష్టవశాత్తూ రనౌట్‌కు బలయ్యాడు. మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ పరుగు కోసం ప్రయత్నించగా, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ స్టోక్స్ జింకలా వేగంగా కదిలి బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. పంత్ క్రీజులోకి చేరుకోకపోవడం రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో పంత్ భారీ స్కోర్ సాధించకపోయినప్పటికీ రిషబ్ పంత్ జూలై 12న (శనివారం) లార్డ్స్ టెస్టులో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
లార్డ్స్ టెస్టులో పంత్ కొట్టిన రెండు భారీ సిక్సర్లు కలుపుకొని ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అతడి సిక్సర్ల సంఖ్య 36కు పెరిగింది. దీంతో, క్రికెట్ లెజెండ్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ వివ్ రిచర్డ్స్‌ను పంత్ వెనక్కి నెట్టారు. రిచర్డ్స్ 34 సిక్సులతో రెండవ స్థానానికి దిగజారారు. వివ్ రిచర్డ్స్ తన 17 ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో ఇంగ్లండ్‌పై 36 మ్యాచ్‌లు ఆడి 34 సిక్సులు బాదగా, పంత్ కేవలం 15వ టెస్టు మ్యాచ్‌లోనే 36 సిక్సులు సాధించిన ఘనత అందుకున్నాడు. రికార్డును తిరగరాశాడు. లార్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ బెన్ స్టోక్స్ వేసిన ఇన్నింగ్స్ 59వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదడం ద్వారా రిచర్డ్స్ రికార్డును పంత్ అధిగమించాడు. ఆ తర్వాత 62వ ఓవర్ తొలి బంతికి షోయబ్ బషీర్ బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టి ఆధిక్యాన్ని పెంచుకున్నాడు.
Read Also- Crime News: ‘దృశ్యం-2’ తలపించేలా అత్తను హత్య చేసిన అల్లుడు
ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
1. రిషబ్ పంత్ (ఇండియా)- 36
2. వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 34
3. టిమ్ సౌథీ (న్యూజిలాండ్)- 30
4. యశస్వి జైస్వాల్ (ఇండియా)- 27
5. శుభ్‌మన్ గిల్ (ఇండియా)- 26
మరో రికార్డు
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో రెండవ స్థానానికి పంత్ చేరుకున్నాడు.
1. వీరేంద్ర సెహ్వాగ్ – 91
2. రిషబ్ పంత్ – 88
3. రోహిత్ శర్మ – 88
4. ఎంఎస్ ధోని – 78
5. రవీంద్ర జడేజా – 72
Read Also- Viral News: గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లలు.. కర్ణాటకలో షాకింగ్ ఘటన
మరోవైపు, లార్డ్స్‌లో 74 పరుగులు సాధించడం ద్వారా ఇంగ్లండ్‌లో టెస్టుల్లో 50కి పైగా స్కోర్‌ను 8వ సారి పంత్ నమోదు చేశాడు. విదేశాల్లో వికెట్‌కీపర్‌గా టెస్టుల్లో అత్యధిక 50కి పైగా స్కోర్లు సాధించిన భారత ఆటగాడిగా ఎంఎస్ ధోనితో (8 ఇన్నింగ్స్) పంత్ సమంగా నిలిచాడు. కాగా, లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 112 బంతులు ఎదుర్కొని 74 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ హీరో కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగవ వికెట్‌కు 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 66వ ఓవర్ మూడో బంతికి బెన్ స్టోక్స్ డైరెక్ట్ థ్రో వేయడంతో పంత్ రనౌట్ అయ్యాడు. రాహుల్‌కు సెంచరీ పూర్తి చేసే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సింగిల్ కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.