Viral News: కర్ణాటక రాష్ట్రం గోకర్ణలోని రామతీర్థ హిల్స్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్న ఓ గుహలో రష్యాకు చెందిన ఓ మహిళను, ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు గుర్తించారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న గోకర్ణ పోలీసులు, జులై 9న రామతీర్థ హిల్స్ ప్రాంతంలో పర్యాటకుల భద్రతను పరిశీలించే సమయంలో బయటపడింది. గోకర్ణ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, తన టీమ్‌తో కలిసి సాయంత్రం 5 గంటల సమయంలో బయలుదేరి వెళ్లగా, అటవీ ప్రాంతంలోని కొండచరియలు విరిగిపడే ముప్పు పొంచివున్న ప్రాంతంలో ఉన్న గుహకు సమీపంలో మనుషుల కదలాడుతున్నట్టుగా పోలీసులు గమనించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా నినా అనే రష్యన్ మహిళ (వయస్సు 40), ఆమె ఇద్దరు కూతుళ్లు ప్రేమ (6 ఏళ్ల 7 నెలలు), అమ (4 ఏళ్లు ) గుహలో నివసిస్తున్నట్టు తేల్చారు.
ధ్యానం కోసం అటవీ జీవితం
తాను, తన పిల్లలు ధ్యానం చేయడానికి గోవా నుంచి గోకర్ణ వచ్చామని, నగర జీవితానికి, రణగొణ శబ్దాల నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో అటవీ ప్రాంతంలో ఉన్న గుహకు వచ్చామని నినా తెలిపింది. ధ్యానం, ఆధ్యాత్మిక భావనలతోనే అక్కడ ఉంటున్నట్టు ఆమె వివరణ ఇచ్చింది. అయితే, చిన్నపిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రామతీర్థ హిల్స్ ప్రాంతంలో 2024 జులైలో భారీగా కొండలు చరియలు విరిగిపడడం, పాములతో పాటు ప్రమాదకరమైన అడవి జంతువులు నివాసం ఉండే ప్రాంతం కావడంతో గుహలో నివాసం ఉండటం చాలా ప్రమాదకరమని అధికారులు చెప్పారు. నినాకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు అక్కడి పరిస్థితి ఎంత ప్రమాదకరమో ఆమెకు వివరించారు. అనంతరం ఆమెను, పిల్లలను సురక్షితంగా గుహ నుంచి బయటకు తీసుకొచ్చారు. నినా అభ్యర్థన మేరకు కుమట తాలూకాలోని బంకికొద్ల గ్రామంలో స్వామి యోగరత్న సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో తాత్కాలికంగా వసతి కల్పించారు.
Read Also- Viral News: భర్త ఫోన్ చోరీ.. విచారిస్తే భార్య బాగోతం బయటకు..
వీసా నిబంధనలు ఉల్లంఘన
పాస్‌పోర్టు, వీసాకు సంబంధించిన వివరాలు చెప్పాలని నినాను పోలీసులు ప్రశ్నించగా, తొలుత ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయింది. పోలీసులు, ఆశ్రమ నిర్వాహకులు, వెల్ఫేర్ అధికారుల ఒత్తిడి చేయగా తన పాస్‌పోర్ట్, వీసా డాక్యుమెంట్లు గుహలో ఎక్కడో పోయి ఉండొచ్చని చెప్పింది. దీంతో, గోకర్ణ పోలీసులు, అటవీ శాఖ అధికారులు గుహలో వెతకగా పాస్‌పోర్ట్, వీసా డాక్యుమెంట్లను లభ్యమయ్యాయి. వీటిని పరిశీలించగా, బిజినెస్ వీసాపై నినా భారతదేశానికి వచ్చినట్టు తేలింది. అయితే, ఆ వీసా గడువు 2017 ఏప్రిల్ 17న ముగిసిందని, 2018లో నేపాల్ వెళ్లి తిరిగి ఇండియాకు వచ్చిందని అధికారులు గుర్తించారు. వీసా గడువు ముగిసిపోయిన తర్వాత కూడా ఆమె భారతదేశంలో ఉంటోందని డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.
Read Also- Screen Time: పిల్లలు మొబైల్ వినియోగంపై అధ్యయనం.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టు తేలడంతో నినా, ఆమె కూతుళ్లు ఇద్దరినీ కార్వార్‌లో ఉన్న ‘ఉమెన్స్ రిసెప్షన్ సెంటర్’లో తాత్కాలికంగా ఉంచారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారికి రక్షణ కల్పిస్తున్నారు. బెంగళూరులోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయంతో (FRRO) ఉత్తర కన్నడ జిల్లా ఎస్పీ సంప్రదింపులు మొదలుపెట్టారు. నినా, ఆమె కూతుళ్లను త్వరలో ఎఫ్ఆర్ఆర్‌వో ఎదుట హాజరుపరచనున్నారు. తదుపరి ప్రక్రియలు ముగిసిన తర్వాత వారిని స్వదేశానికి పంపించనున్నారు.