Red Rainbow: సాధారణంగా ఇంద్రధనుస్సు అనగానే మనందరికి ఏడు రంగులే గుర్తుకు వస్తాయి. ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా రంగులతో ఉండే ఇంద్రధనుస్సు మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. అయితే నీటి మీద కనిపించే ప్రతిబింబపు ఇంద్రధనుస్సు (Reflected rainbows), చంద్రకాంతితో ఏర్పడే మూన్ బోస్ (Moonbows) సైతం ఏడు రంగులతో దర్శనమిస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఒకే రంగుతో కనిపించే మోనోక్రోమ్ రెయిన్ బోను చూశారా? కనీసం దాని గురించి విన్నారా? లేదు కదూ!. ఈ ప్రత్యేక కథనంలో ఆ సింగిల్ కలర్ ఇంద్రధనుస్సు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1881 నాటి నివేదిక ప్రకారం..
1881లో నేచర్ (Nature) అనే సైన్స్ జర్నల్ పత్రికలో.. భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సిల్వానస్ పి. థాంప్సన్ (Silvanus P. Thompson) ఒక వ్యాసం రాశారు. అందులో తాను నాలుగేళ్ల క్రితం సూర్యాస్తమయం సమయంలో చూసిన అరుదైన ఇంద్రధనుస్సు గురించి వివరించారు. ఆ సమయంలో కేవలం ఎరుపు, నారింజ రంగులు మాత్రమే కనిపించాయని చెప్పారు. ఇలాంటి ఎరుపు రైన్‌బోలు సాధారణంగా సూర్యాస్తమయం సమయంలోనే కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఎరుపు రైన్‌బోలు ఎలా ఏర్పడతాయి?
ఎరుపు రైన్‌బోలు కూడా సాధారణ ఇంద్రధనుస్సులాగే ఏర్పడతాయి. సూర్యకాంతి నీటి బిందువులపై 42 డిగ్రీల కోణంలో పడి ప్రతిఫలించినప్పుడు రంగులు విడిపోయి మన కంటికి కనిపిస్తాయి. ఆ సమయంలో కాంతి యొక్క విభిన్న తరంగదైర్ఘ్యాలు విభిన్న రంగులను సృష్టిస్తాయి. ఉదయం లేదా సాయంత్రం సమయంలో సూర్యుడు దిగువన (హారిజన్ దగ్గర) ఉన్నప్పుడు కిరణాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఆ సమయంలో చిన్న తరంగదైర్ఘ్యం కలిగిన నీలం, ఆకుపచ్చ వంటి రంగులు గాల్లోనే వ్యాపించి మాయం అవుతాయి. ఎరుపు రంగు మాత్రమే పొడవైన తరంగదైర్ఘ్యం కలిగి ఉండడం వల్ల అది మన కంటికి చేరుతుంది. అందుకే ఈ అరుదైన ఇంద్రధనుస్సులో కేవలం ఎరుపే కనిపిస్తుంది. అయితే మోనోక్రోమ్ రెయిన్ బో చాలా అరుదుగా కనిపిస్తాయి.
Also Read: Google Fined: గూగుల్‌కు బిగ్ షాక్.. ఏకంగా రూ.300 కోట్ల జరిమానా.. ఎందుకంటే?
2020లో రెండుసార్లు దర్శనం
2020లో రెండు సందర్భాల్లో రెడ్ రైన్‌బో (Red Rainbow)లు రికార్డ్ అయ్యాయి. ఫిన్లాండ్ (Finland) లోని పైజన్నే టావాస్టియా (Paijanne Tavastia) వద్ద ఒక మత్స్యకారుడు ఆకాశంలో పూర్తిగా ఎరుపు రంగులో మాత్రమే ఉన్న ఇంద్రధనుస్సును చూశాడు. ‘వాన మొదలైంది. ఆ తర్వాత ఎరుపు ఇంద్రధనుస్సు కనిపించింది. మొదటి నుంచి చివరి వరకు స్పష్టంగా కనిపించింది. అది మొత్తం ఎరుపే! చూసి వింతగా అనిపించింది’ అని ఆ వ్యక్తి తెలిపాడు. అతను ఆ దృశ్యాన్ని ఫోటో కూడా తీశాడు. అదే సంవత్సరంలో బోట్స్‌వానాలో కూడా ఒక పాక్షిక ఎరుపు రైన్‌బో కనిపించినట్లు కథనాలు వచ్చాయి. ఇంద్రధనుస్సు అంటే సాధారణంగా ఏడు రంగుల మాయాజాలం. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రకృతి మనకు కేవలం ఒకే రంగుతో కూడిన అరుదైన అద్భుతాన్ని చూపిస్తుంటుంది.