Google Fined: గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలో ఆ సంస్థకు రూ.300 కోట్ల (36 మిలియన్ అమెరికన్ డాలర్లు) మేర జరిమానా విధించారు. తన సెర్చ్ ఇంజిన్ కు పోటీదారులుగా ఉన్న సంస్థలను దూరం పెట్టే విధంగా గూగుల్ ఒప్పందాలు (Anti competitive agreements) చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టగా నిజం అని తేలింది. దీంతో జరిమానా విధించేందుకు గూగుల్ అంగీకరించడం గమనార్హం.
అసలేం జరిగిందంటే?
2019 డిసెంబర్ నుండి 2021 మార్చి వరకు గూగుల్ ఆస్ట్రేలియాలోని ప్రముఖ టెలికాం సంస్థలు టెల్స్ట్రా (Telstra), ఆప్టస్ (Optus) లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ప్రకారం ఆ కంపెనీలు అమ్మిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి. ఇతర ప్రత్యామ్నాయ సెర్చ్ ఇంజిన్‌లకు అవకాశం ఇవ్వకూడదు అని షరతు పెట్టారు. దీనికి ప్రతిఫలంగా గూగుల్ తనకు వచ్చిన ప్రకటనల ఆదాయంలో కొంత భాగం ఆ టెలికాం సంస్థలకు అందచేసింది.
ఏసీసీసీ ఫిర్యాదు
అయితే అంతర్గతంగా జరిగిన ఈ ఒప్పందం వెలుగులోకి రావడంతో ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ అండ్ కన్‌స్యూమర్ కమిషన్ (ACCC) చర్యలకు ఉపక్రమించింది. గూగుల్ చేసుకున్న అనైతిక ఒప్పందాల వల్ల ఆస్ట్రేలియాలోని వినియోగదారులకు ప్రత్యామ్నాయ సెర్చ్ ఇంజిన్‌లు ఉపయోగించే అవకాశం తగ్గిపోయిందని ఆరోపించింది. పోటీదారులు మార్కెట్లో కనిపించే అవకాశాలు కూడా కోల్పోయారని తెలియజేసింది. దీంతో దిగొచ్చిన గూగుల్.. ఇందుకు జరిమానా చెల్లించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి షరతులు పెట్టబోమని కోర్టు సమక్షంలో లిఖిత పూర్వక హామీ సైతం ఇస్తామని చెప్పింది.
ఏసీసీసీ ఛైర్మన్ ఏమన్నారంటే?
గూగుల్ కుదుర్చుకున్న అనైతిక ఒప్పందం గురించి ఏసీసీసీ ఛైర్మన్ జీనా క్యాస్ గాట్లిబ్ (Gina Cass-Gottlieb) స్పందించారు. ‘ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో కోట్లాది ఆస్ట్రేలియన్లు తమ మొబైల్‌లో మరిన్ని సెర్చ్ ఇంజిన్ ఎంపికలు చేసుకోవచ్చు. పోటీదారులకు కూడా మార్కెట్లోకి రావడానికి మంచి అవకాశం లభిస్తుంది’ అని అన్నారు. మరోవైపు గూగుల్ సైతం దీనిపై స్పందించింది. ఏసీసీసీతో సమస్య పరిష్కారమైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి షరతులు చాలా కాలంగా మా ఒప్పందాల్లో లేవు. ఆండ్రాయిడ్ తయారీదారులకు బ్రౌజర్లు, సెర్చ్ యాప్‌లు ముందుగానే లోడ్ చేయడంలో మరింత స్వేచ్ఛ ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నాము’ అని గూగుల్ ప్రతినిధి అన్నారు.
Also Read: Ponguleti on Harish Rao: తెలంగాణలో ఆసక్తికర ఘటన.. హరీష్‌రావు ఫొటోకు మంత్రి ఫన్నీ క్యాప్షన్!
గూగుల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి
ఇటీవల కాలంలో గూగుల్‌పై యూరప్, అమెరికా వంటి దేశాల్లో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. గూగుల్ తన ఆధిపత్యాన్ని వాడుకుని వినియోగదారులు, డివైస్ తయారీదారులు, యాప్ డెవలపర్‌లపై ప్రభావం చూపుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో వచ్చిన ఈ తీర్పు.. ప్రపంచవ్యాప్తంగా బిగ్‌టెక్ కంపెనీలను నియంత్రించడానికి ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ తీర్పుతో ఆస్ట్రేలియాలో కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేసే వారు గూగుల్ మాత్రమే కాకుండా ఇతర సెర్చ్ ఇంజిన్‌లను కూడా ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది.