RCB Stampede: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఐపీఎల్-18 ఎడిషన్ (IPL) టైటిల్ గెలిచిన సందర్భంగా, సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన ఈ విషాదంలో ఏకంగా 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే, ఈ ఘటన జరిగిన దాదాపు ఒక నెల రోజుల తర్వాత, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ దుర్ఘటన బాధ్యత మొత్తం ఆర్సీబీ ఫ్రాంచైజీదేనని తేల్చిచెప్పింది. సన్మాన కార్యక్రమ వేడుకల నిర్వహించడానికి ముందుగా పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోలేదని పేర్కొంది. ఈ మేరకు సెంట్రల్ ట్రిబ్యునల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
‘‘ఆర్సీబీ ఫ్రాంచైజీ పోలీసుల నుంచి తగిన అనుమతులు తీసుకోలేదు. సోషల్ మీడియాలో అకస్మాత్తుగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లోని సమాచారాన్ని చూసి అభిమానులు స్టేడియం వెలుపల పెద్దఎత్తున గుమిగూడారు. సమయాభావం కారణంగా పోలీసులు కూడా తగిన ఏర్పాట్లు చేయలేకపోయారు. దాదాపు 12 గంటల స్వల్ప వ్యవధిలో పోలీసులు అప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసేస్తారని ఆశించలేము’’ అని ట్రిబ్యునల్ పేర్కొంది.
పోలీసు అధికారులపై సానుభూతి
తొక్కిసలాట విషాదానికి కారణమంటూ గతంలో నిందలు ఎదుర్కొన్న నగర పోలీసు అధికారులపై ట్రిబ్యునల్ సానుభూతి వ్యక్తం చేసింది. ఏకంగా 5-7 లక్షల మంది రద్దీని నియంత్రించగలిగే ఏర్పాట్లను కేవలం 12 గంటల్లోనే పూర్తిచేయడానికి పోలీసులేం మానవాతీతులు కాదని వ్యాఖ్యానించింది. ‘‘పోలీసు సిబ్బంది కూడా మనలాగా మనుషులే. దేవుళ్లేం కాదు, మాయాజాలం తెలిసినవాళ్లు కూడా కాదు. చేతి వేలు రుద్ది ఎలాంటి కోరికైనా తీర్చగలిగే అల్లాద్దీన్ అద్భుత దీపం వంటి మాయాశక్తులు కూడా వారివద్దలేవు’’ అని సానుభూతి వ్యక్తం చేసింది.
Read also- PM Modi: డిజిటల్ ఇండియాకు పదేళ్లు.. మోదీ ఫస్ట్ రియాక్షన్ ఇదే
నిజానికి, ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచినప్పుడు విజయోత్సవాల నిర్వహణకు బెంగళూరు నగర పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జూన్ 3న రాత్రి టైటిల్ గెలవడంతో అభిమానులు ఒక్కసారిగా బెంగళూరు నగర రోడ్లపైకి వచ్చారు. దీంతో, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా నగర పోలీసులు బాగా కష్టపడ్డారు. తెల్లవారుజామున 3-4 గంటల (జూన్ 4 తెల్లవారుజామున) వరకు కూడా డ్యూటీలోనే ఉన్నారు. రోడ్లపై యువతను కంట్రోల్ చేస్తూ ఎలాంటి రచ్చజరగకుండా చూసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ (జూన్ 4) విజయోత్సవమంటే సాధ్యమయ్యే పనికాదని పోలీసులు అప్పుడే తేల్చి చెప్పారు. అభిమానులు రోడ్లపైకి వస్తే ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తుతాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓపెన్ టాప్ బస్‌పై ఊరేగింపు ఏమాత్రం క్షేమం కాదని పేర్కొన్నారు. అయితే, అప్పటికే సెలబ్రేషన్ల కోసం అభిమానులు ఎదురుచూస్తునన సమయంలో ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. విజయోత్సవ వివరాలు ప్రకటించింది. ఆర్సీబీ టీమ్ అహ్మదాబాద్ నుంచి బెంగళూరు చేరుకున్న కొన్ని గంటల్లోనే అభిమానులు లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు. దీంతో, వారిని నియంత్రించడం పోలీసులకు సాధ్యంకాలేదు.
Read also- Captain Cool: ‘కెప్టెన్ కూల్’పై ధోనీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్..